ఒకే చాంబర్‌పై హరీష్, ఈటెల మక్కువ, క్వార్టర్స్‌ఇచ్చారు
హైదరాబాద్: మంత్రులు సచివాలయంలో తమ తమ చాంబర్ల కోసం అన్వేషిస్తున్నారట. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర, హోంమంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు మంగళవారం సెక్రటేరియట్‌కు వచ్చారు. సోమవారం తెలంగాణ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కెసిఆర్ మంచి ముహూర్తం ఉందని అదే రోజు సచివాలయంలో తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.
మంగళవారం మంచిరోజు కాదనే ఉద్దేశంతో మంత్రులెవరూ బాధ్యతలు చేపట్టలేదు. మంత్రులంతా బుధ, గురువారాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపయోగించిన చాంబర్‌నే తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర ఉపయోగించుకోనున్నారు. ఆయన మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమైనా, మంచి రోజు కాదనే ఉద్దేశంతో బాధ్యతలు చేపట్టలేదు. బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు.

డి బ్లాక్‌లోని ఈ చాంబర్‌పై ఈటెల ఆసక్తి చూపిస్తుంటే, ఇదే చాంబర్‌ను సోమవారం మరో మంత్రి తన్నీరు హరీశ్ రావు చూసి వెళ్లారని అధికార్లు ఈటెల దృష్టికి తీసుకొచ్చారు. అయితే తాను హరీశ్ రావుతో మాట్లాడతానని ఈటెల అధికారులకు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి అలీ ఇదే బ్లాక్‌లో గతంలో మంత్రి శ్రీధర్ బాబు ఉపయోగించిన చాంబర్‌ను పరిశీలించారు. ఈ ఛాంబర్ చిన్నగా ఉందని, ఉప ముఖ్యమంత్రిగా పెద్ద చాంబర్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారు.
మంత్రుల చాంబర్‌కన్నా ఉప ముఖ్యమంత్రి చాంబర్ చిన్నగా ఉంటే బాగోదని పెద్ద చాంబర్ కోసం చూస్తున్నారు. తెలంగాణ మంత్రులు నివాస గృహాలు కేటాయించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తెలంగాణ మంత్రులకు నివాస గృహాలు కేటాయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ఇక్కడే నివాస గృహాలు కేటాయించారు. మంత్రుల క్వార్టర్స్‌లో ఒకటి నుంచి 15 వరకు తెలంగాణ మంత్రులకు, తరువాత నివాస గృహాలను ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈటెలకు క్వార్టర్ నంబర్ 12, పోచారంకు 5, జగదీశ్వర్ రెడ్డికి 15, హరీశ్ రావుకు క్వార్టర్ నంబర్ 7 కేటాయించారు.












Click it and Unblock the Notifications