రఘురామకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..! నాలుగో పిటిషన్ సైతం..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు (raghurama krishnam raju) కు ఇవాళ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన నియోజకవర్గం ఉండి పరిధిలో ఉన్న ఆకివీడు పెద్ద పేట రామాలయం నిర్మాణం విషయంలో జరుగుతున్న పోరాటంలో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మరోసారి తోసిపుచ్చింది. ఈ రామాలయం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రఘురామ హైకోర్టులో మరోసారి గెలిచినట్లయింది.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ కొట్టేసింది. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు తేల్చేసింది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించిన తరువాత జిల్లా కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్ రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని తెలిపింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

గతంలో రామాలయం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ అనంతరం.. దీనిపై ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్‌లో రిట్ పిటిషన్లు ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించింది. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని హైకోర్టు చెప్పగా.. డిస్పోజ్ చేయాలని పిటిషనర్ల తరఫు లాయర్ కోరారు. దీంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.దీంతో పిల్ ఉపసంహరించుకున్నారు. కానీ తాజాగా ఆలయ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దాన్నీ తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications