రఘురామ షాకింగ్-దేవుడి సొమ్ము కోసమే టీటీడీ అథారిటీ- సంచలన విమర్శలతో జగన్‌కు లేఖ
తిరుమల శ్రీవారి ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో రాస్తున్న లేఖల్లో భాగంగా.. ఇవాళ ఏడో ఉత్తరాన్ని వదిలారు. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీతో కొత్త వివాదానికి తెరదీశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా 146 జీవో విడుదల చేశారన్నారు. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ప్రజల్లో ఆందోళన నెలకొందని రఘురామ చెప్పారు.

టీటీడీపై జగన్‌ను టార్గెట్ చేసిన రఘురామ
నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు వరుసగా లేఖలు సంధిస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఇవాళ తన సిరీస్‌లో ఏడో లేఖను టీడీడీ స్పెసిఫైడ్ అథారిటీపై రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవీ కాలం ముగిసినందున ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం 1987 లోని 137 సెక్షన్ ప్రకారం మీరు జీవో ఎంఎస్ నెం 146, తేదీ 23.06.2021 విడుదల చేసి స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో రఘురామ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడానికే ఇలాంటి అవాంఛనీయమైన జీవో విడుదల చేసి స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారని భక్తులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు.

దేవుడి సొమ్ము దారి తప్పిస్తారేమో ?
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే ప్రభుత్వం స్పెసిఫైడ్ అధారిటీ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిందన్న అభిప్రాయం ఉందని రఘురామ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. హిందూ ధర్మం ఆచరించే పలువురి నమ్మకాలను ఇది గాయపరుస్తోందన్నారు.. కొత్త స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ఎవరికీ నమ్మకం కలగట్లేదు. దేవుడి సొమ్ము దారి తప్పిస్తారేమోనని కూడా ఆందోళన చెందుతున్నారని రఘరామ తెలిపారు. అథారిటీకి ఆర్థిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తీసేయాలన్నారు. కొత్త బోర్డు ఏర్పడ్డాకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు.

చర్చకు వీల్లేకుండా స్సెసిఫైడ్ అథారిటీ
ఇద్దరు సభ్యులతో టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తే వారు తీసుకునే నిర్ణయాలపై చర్చకు వీలుండదని రఘురామ తెలిపారు. ట్రస్టు బోర్డు అధికారాలను అథారిటీకి బదిలీ చేసినట్లు అర్థమవుతోందన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటే తదుపరి మీరు ఈ అధికారుల ద్వారా తీసుకోబోయే నిర్ణయాలను అడ్డుకుంటారని మీరు ఈ పని చేసినట్లుగా ప్రజలలో పూర్తి స్థాయి అపోహ ఉందని రఘురామ జగన్‌కు తెలిపారు. అందుకే కాలయాపన చేయకుండా నూతన బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం 1987 లోని 137 సెక్షన్ ను ఉపయోగించి స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదని తెలిపారు. ఈ నిర్ణయం హిందూ ధర్మాన్ని ఆచరించే పలువురి నమ్మకాలను తీవ్రంగా గాయపరుస్తున్నదన్నారు.

అప్పుడు జంబో బోర్డు-ఇప్పుడు ఇద్దరా ?
తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డులో ఇబ్బడి ముబ్బడిగా సభ్యుల సంఖ్యను పెంచేసి మొత్తం 37 మందిని వరకూ నామినేట్ చేసిన మీరు, ఏ కారణం చేతనైతేనేమి దాన్ని స్పెసిఫైడ్ అథారిటీ పేరుతో కేవలం ఇద్దరు సభ్యులకు కుదించడంపై మన ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు అందరూ మరీ ముఖ్యంగా భక్తులు అందరూ శంకిస్తున్నారని రఘురామ జగన్‌కు రాసిన లేఖలో ఆక్షేపించారు. ఈ కొత్త స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ఎవరికి నమ్మకం కలగడం లేదన్నారు.. సాధారణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గానీ ఇలాంటి స్పెసిఫైడ్ అథారిటీలో సభ్యులుగా ఉంటారని,. అలాంటి సాంప్రదాయాన్ని కూడా ప్రస్తుతం పట్టించుకునే స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎంతో అనుభవం ఉన్న రాష్ట్ర క్యాడర్ కు చెందిన ఎంతో మంది అధికారులు పోస్టింగ్ లు లేక ఖాళీగా ఉన్న సమయంలో నాన్ క్యాడర్ అధికారి అయిన ధర్మారెడ్డిని ఈ స్పెసిఫైడ్ అథారిటీలో సభ్యుడుగా నియమించడం భక్తులకు మరిన్ని అనుమానాలు కలిగిస్తోందని రఘురామ ఆరోపించారు.












Click it and Unblock the Notifications