ఏపీ సీఐడీపై ఏసీబీ విచారణ ? చంద్రబాబుకు రఘురామ షాకింగ్..!
ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పెట్టబోతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టడీ హింసను మర్చిపోలేకపోతున్న ఆయన.. అందుకు బాధ్యులైన వారిపై కూటమి సర్కార్ ఆశించిన స్ధాయిలో చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.
గతంలో తనను సీఐడీ కస్టడీలో హింసించిన కేసులో నిందితుడిగా ఉన్న గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు కామేపల్లి తులసిబాబును మరో వ్యవహారంలో బుక్ చేసేందుకు రఘురామ సిద్దమయ్యారు. గతంలో సీఐడీకి హైకోర్టులో క్రిమినల్ కేసుల విచారణలో న్యాయ సలహాదారుగా పనిచేసిన తులసిబాబుకు రూ.48 లక్షలు ఫీజుగా చెల్లించిన వ్యవహారాన్ని ఆయన ఇవాళ తెరపైకి తెచ్చారు. అంతే కాదు ఎలాంటి అర్హతలు లేని తులసిబాబుకు ఇంత ఫీజు ఎలా చెల్లించారని సీఐడీని ప్రశ్నించారు.

అక్కడితో ఆగకుండా సీఐడీపై ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు కోరతానని రఘురామ వెల్లడించారు. త్వరలో ఈ మేరకు ఏసీబీకి లేఖ రాస్తానని రఘురామ తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్ధితి. ఇప్పటికే తనపై కస్డడీ దాడి కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ లను సస్పెండ్ చేయడం లేదనే అసంతృప్తితో ఉన్న రఘురామ.. సీఐడీ గతంలో తీసుకున్న నిర్ణయాలను తవ్వితీసి ఏసీబీ విచారణ కోరుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రఘురామ అనుకున్నట్లుగానే ఏసీబీ ముందు ఈ డిమాండ్ పెడితే అప్పుడు ఏపీ ప్రభుత్వంలో రెండు దర్యాప్తు సంస్థలూ ఇరుకునపడటం ఖాయం.












Click it and Unblock the Notifications