అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ యుద్ధభూమి నుంచి పారిపోతున్నారని, ఆయనకు ఓటు ఎందుకు వేయాలన్నారు.
వైసిపికి 'ఖాళీ' షాక్: 'అసెంబ్లీకి రాకుంటే అలా అనర్హత వేటు వేయొచ్చు'
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా, పాదయాత్రకు వెళతానని అనడం విడ్డూరమన్నారు.

యుద్ధ భూమి నుంచి పారిపోవడమే
జగన్ తీరు ముమ్మాటికీ యుద్ధభూమి నుంచి పారిపోవడమేనని రఘువీరా ఎద్దేవా చేశారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కరించడానికే జగన్‌కు ప్రతిపక్ష నేత పదవిని ప్రజలు కట్టబెట్టారని చెప్పారు.

అలాంటి నేత దేశంలో జగన్ మాత్రమే
ఎవరైనా ఏదైనా సమస్యను జగన్ వద్ద ప్రస్తావిస్తే 'నన్ను ముఖ్యమంత్రిని చేయండి' అనే సమాధానం ఇస్తారని రఘువీరా విమర్శించారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి... అప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పే నాయకుడు దేశంలో జగన్ ఒక్కరే అన్నారు.

ప్రజామోదం ఉండదు
ఓ వైపు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వెళ్లనంటున్నారని, ఇలాంటి వారికి ప్రజలు ఓటు ఎందుకు వేయాలని రఘువీరా ప్రశ్నించారు. జగన్ పాదయాత్రకు ప్రజలు రావచ్చేమో కానీ ఆ పాదయాత్రకు ప్రజామోదం ఉండదన్నారు.

అది తీవ్ర తప్పిదం
వైసిపి అధినేత జగన్‌ను, ఆయన పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవడం తీవ్ర తప్పిదమని రఘువీరా అభిప్రాయపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!