కేసుల ఉద్యమం: ధర్నా చేసిన రఘువీరా అరెస్టు, ఓవర్ యాక్షన్ అని జెసి
అనంతపురం: ప్రత్యేక హోదా, ఇతర హామీలపై మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎఫ్ఐఆర్ కాపీ కావాలంటూ సోమవారం అనంతపురంలోని పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాము కేసులకు భయపడబోమని రఘువీరా రెడ్డి అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని అడిగినందుకు తమనే అరెస్టు చేశారని ఆయన అన్నారు. దీన్నిబట్టి బిజెపి, టిడిపి ప్రత్యేక హోదాకు వ్యతిరేకమని తేలిందని ఆయన అన్నారు. ద్రోహం చేసినవారిని వదిలేసి తమను అరెస్టు చేశారని ఆయన అన్నారు. ఆ ముగ్గురిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తమను పోలీసులు అరెస్టు చేశారని ఆయన విమర్శించారు.

కాగా, రఘువీరా రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులపై ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రఘువీరా రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆయన అన్నారు. రఘువీరా ధర్నా చేయడం ఎందుకని ఆయన అడిగారు.
ప్రత్యేక హోదా రావడం కష్టమేనని ఆయన మరోసారి చెప్పారు. అయితే, ఎక్కువ ఆర్థిక సాయాన్ని రాబట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని ఆయన చెప్పారు. ఇలాంటి పనులు చేయవద్దని ఆయన రఘువీరాకు సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications