ఢిల్లీ ఎన్నికలకే: రఘువీరా, బాబుతో సినీ ప్రముఖులు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. కోటి సంతకాల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు వారి ఓట్ల కోసమే ప్రత్యేక హోదా కుట్రకు తెరలేపారని మండిపడ్డారు.
కేంద్రం సాయం కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గట్టిగా ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. చిల్లర వేసి ఏపీ ప్రజలను అవమానపరిచారన్నారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, స్టీల్ ప్లాంట్ వంటి హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు.
విభజన చట్టంలో తెలిపిన భారీ హామీలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. రేపటి నుండి కోటి సంతకాల సేకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. హైదరాబాదులోని ఏపీ ప్రజల నుండి కూడా కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు సేకరిస్తామని చెప్పారు.

ఏపీకి రూ.350 కోట్లంటూ కేంద్రం చేసిన ప్రకటన తెలుగు ప్రజలను అవమానించేలా ఉందన్నారు. రూ.24,350 కోట్లు అడిగితే రూ.350 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. బడ్జెట్ పూడ్చేందుకు రూ.13,500 కోట్లు అడిగితే రూ.500 కోట్లే ఇచ్చారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సీమాంధ్ర హక్కు అన్నారు.
చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు గురువారం ఉదయం సమావేశమయ్యారు. నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దర్శకుడు రాఘవేంద్ర రావు సీఎం చంద్రబాబును కలిశారు. తుపాను బాధితుల కోసం సేకరించిన రూ.11 కోట్ల చెక్కును వారు అందజేశారు.












Click it and Unblock the Notifications