తెలంగాణ ఎఫెక్ట్, ఏపీలో పొత్తులో ఇవే కీలకం!: బాబుకు రాహుల్ గాంధీ 'స్పెషల్' షాకిస్తారా?
అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ షాకిచ్చే అవకాశముందా? అంటే కొట్టిపారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో పొత్తుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఫెయిలైంది. ఇక్కడ పొత్తు విజయవంతమైతే ఏపీలో ఎలాంటి అనుమానాలకు అవకాశం ఉండకపోయేది. కానీ తెలంగాణలో మహాకూటమి ఓటమి, కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదనలు చూస్తుంటే ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని అంటున్నారు.
రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?

ఏపీలో మనకు పొత్తు అవసరం లేదు
ఏఐసీసీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని ఇటీవల పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. సోమవారం ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, మరో నేత మస్తాన్ వలీలు రాహుల్‌తో భేటీ అయ్యారు. వీరు ఒడిశా రాష్ట్ర వ్యవహారాలను చూస్తున్నారు. ఆ రాష్ట్రం గురించి మాట్లాడిన తర్వాత ఏపీ గురించి చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పొత్తు అనవసరమని వారిద్దరు అధినేత (రాహుల్ గాంధీ)తో చెప్పారని తెలుస్తోంది.

పొత్తులపై త్వరలో నిర్ణయం
అలాగే, తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డైలమాలో ఉన్నారని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని వారు.. రాహుల్ గాంధీ ఎదుట చెప్పారని తెలుస్తోంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ... పొత్తులపై త్వరలో నిర్ణయం తీసుకుందామని వారితో చెప్పారని తెలుస్తోంది.

టీడీపీతో పొత్తులో ఇదే కీలకం
మంగళవారం, సోనియా, రాహుల్ గాంధీలతో ఏపీ కాంగ్రెస్ నేతలు పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు కలిశారు. ఏపీ రాజకీయాలపై వారు చర్చించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తుపై నివేదిక అందించారు. వీరితో పాటు మరికొందరు కూడా పొత్తుపై నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ పొత్తులో ఈ నివేదికలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల అభిప్రాయలు కీలకం కానున్నాయి.

రఘువీరా రెడ్డి
ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై రెండు పార్టీల్లోను భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. కానీ మరికొందరు నేతలు మాత్రం పొత్తుకు ససేమీరా అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, నాలుగున్నరేళ్లు హోదా కోసం టీడీపీ ఏం చేసిందని, చంద్రబాబు దీనిపై పలుమార్లు మాటలు మార్చారని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే బీజేపీ, టీడీపీలు హోదా హామీని నెరవేర్చలేదని ప్రజలకు అర్థమైందని, ఇప్పుడు మనం ఇస్తామని చెప్పాం కాబట్టి ఒంటరిగా వెళ్లడమే మంచిదని అధిష్టానానికి చెబుతున్నారని తెలుస్తోంది. మనం హోదా ఇస్తామని చెప్పడం, టీడీపీ నాలుగున్నరేళ్లుగా దాని కోసం ప్రయత్నాలు చేయకపోవడానికి తోడు, పలుమార్లు మాటలు మార్చడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ నేతలు కొందరు అధిష్టానానికి చెబుతున్నారట. దానికి తోడు తెలంగాణలో పొత్తు విఫలమైంది.

సీట్ల లెక్క.. ఎన్ని గెలిచినా క్రెడిట్ టీడీపీకే
దీంతో పాటు తెలుగుదేశం పార్టీతో కలిస్తే తక్కువ సీట్లకు సర్దుకుపోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని తెలుస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేసి తిరిగి కాంగ్రెస్ తన బలాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉందని, టీడీపీతో పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచినా క్రెడిట్ ఆ పార్టీకే పోతుందని కొందరు వాపోతున్నారట. ఈ విషయాలన్నింటిని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అందరి నుంచి నివేదికలు, అభిప్రాయాలు తీసుకొని రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ఉవ్వీళ్లూరుతున్నారు. అది రివర్స్ అవుతుందా చూడాలి. వీరి కూటమి కేవలం జాతీయరాజకీయాలకే పరిమితమవుతుందా, ఏపీకి కూడా ఉంటుందా ముందు ముందు తేలనుంది. ఏపీలో పొత్తుకు నేతల అభిప్రాయాలు, నివేదికలు, టీడీపీ ఇచ్చే సీట్లు, ప్రత్యేక హోదా తదితర అంశాలు కీలకంగా మారనున్నాయని అంటున్నారు.