షార్ట్ సర్క్యట్ వల్ల రైలు ప్రమాదం!: మంత్రి కోట్ల కంటతడి
హైదరాబాద్: ఎసి యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడం వల్లనే అనంతపురం జిల్లా రైలు ప్రమాదం సంభవించినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ఎసి కోచ్‌లలో ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా, వినియోగ వ్యవస్థల మధ్య ఉన్న అంతరాల కారణంగానే నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని టెక్నిషియన్లు భావిస్తున్నారు. ఎసి కోచ్‌కు అవసరమయ్యే ఎయిర్ కండిషనర్‌ను పని చేయించడానికి ఏర్పాటు చేసిన బ్యాటరీ వ్యవస్థపై విపరీతమైన లోడ్ పడుతుండడమే అగ్ని ప్రమాదాలకు కారణమవుతోందట.

కాగా, రైలు ప్రమాదంలో ముద్దముద్దగా మారిన మృతదేహాలను చూసిన రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం ఉదయం ఆయన సంఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని చూసి చలించి పోయిన ఆయన కన్నీరు పెట్టారు. రైలు ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి, ఎంపి అనంత వెంకటరామి రెడ్డి చెప్పారు.
రైలు బోగీల్లో అగ్ని ప్రమాద నిరోధక, హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో రైలు బోగీ దగ్ధమైన సంఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరగడంపై ఆందోళన వెలిబుచ్చారు. ఈ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమబాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికులకు వసతుల కల్పన కోసం రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖార్గేకు బాబు శనివారం లేఖ రాశారు.












Click it and Unblock the Notifications