ఏపీపై రైల్వే ప్రేమ: రూ.2506 కోట్ల ఆ రైల్వేలైన్ తో రాయలసీమ జిల్లాలకు మహర్దశ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే పురోభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైలు రవాణాను మరింత పురోగతి దిశగా ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. కడప జిల్లాలోని పులివెందులకు త్వరలో రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
పులివెందుల మీదుగా రైల్వే లైన్
కడప బెంగళూరు మార్గాన్ని పులివెందుల మీదుగా నిర్మించడం కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి మధ్య 110 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంత వాసులకు రైల్వే సేవలు మరింత మెరుగ్గా అందబోతున్నాయి. రైల్వే చేపట్టే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 2505.89 కోట్ల రూపాయలుగా ఉంది.

డీపీఆర్ ఆమోదం పొందితే పనులు షురూ
ఈ మేరకు డీపీఆర్ సిద్ధం చేసి పంపారు. ఈ డి పి ఆర్ ఆమోదం పొందితే వెంటనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న క్రమంలో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న పరిశ్రమలకు అవసరమైన రవాణా సదుపాయాలను ఈ రైల్వే లైన్ మెరుగుపరుస్తుంది.
మానవ రవాణాతో పాటు సరుకు రవాణాకు ఈ రైల్వే లైన్ తో ఉపయోగం
రాయలసీమ పురోగతిలో ఈ రైల్వేలైన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ కొత్త రైల్వే లైన్ వల్ల కడప జిల్లాలో ఉద్యాన పంటలకు, బొగ్గు రవాణాకు, ఖనిజ సంపద రవాణాకు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ తయారీ కంపెనీలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మానవ రవాణాతో పాటు సరుకు రవాణాకు దోహదం చేస్తుంది.
రైల్వే లైన్ల విస్తరణతో రాయలసీమకు పర్యాటక, పారిశ్రామిక ప్రగతి
ఇదే సమయంలో ఓబులవారిపల్లె గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్ల నిర్మాణం కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఓబులవారిపల్లె రేణిగుంట మధ్య ఇప్పటికే రెండు రైల్వే లైన్లు ఉండగా ఇప్పుడు మూడో లైన్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందించారు. ఇలా అనేక కొత్త రైల్వే లైన్లు, పులివెందుల మీదుగా ఈ రైల్వే లైన్ ల విస్తరణతో రాయలసీమ పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు పులివెందుల మీదుగా రైల్వే లైన్ ప్రతిపాదనల పైన స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications