తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ - ఎక్కడ నుంచి ఎక్కడ దాకా..!!
ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ప్రజల కోసం త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకు వందేభారత్ కేటాయిస్తూ దీనికి సంబంధించి డిమాండ్.. ప్రయాణీకుల రద్దీ.. రూట్ పైన ప్రతిపాదనలు ఇవ్వాలని రైల్వే శాఖ సూచించింది. ప్రధాని విశాఖ పర్యటనకు ఖరారు అయిన సమయంలోనే..రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు ఈ మేరకు సమాచారం అందింది.
తెలుగు ప్రజలకు వందేభారత్ రైలు
దీని పైన దక్షిణ మధ్య రైల్వే అధికారుల నుంచి మూడు ప్రతిపాదనలు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, రూటు పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో..అధికారికంగా రూటు ప్రకటించకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వస్తోందంటూ కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూ.466 కోట్లతో పునర్నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేసారు. ప్రధాని మోదీయే డిజైన్ ఎంపిక చేశారని స్వయంగా రైల్వే మంత్రి వెల్లడించారు. నిర్మాణ పనుల కాంట్రాక్టునూ ఖరారు చేశామన్నారు. త్వరితగతిన ఈ పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2014లో రైల్వేకి 886 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు మోదీ ప్రభుత్వం రూ.7,032 కోట్లు కేటాయించిందని మంత్రి వివరించారు.

మూడు రూట్లలో ప్రతిపాదనలు సిద్దం
ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ , అదే విధంగా సికింద్రాబాద్ టు విశాఖ, దీంతో పాటుగా సికింద్రాబాద్ టు తిరుపతి..ఈ మూడు లైన్లలో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం. అందులో ప్రధానంగా సికింద్రాబాద్ - విజయవాడ మధ్య ఈ రైలు జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, సికింద్రాబాద్ టు విశాఖ, లేదా సికింద్రాబాద్ టు తిరుపతి కి ఈ కొత్త రైలు కేటాయించటం ద్వారా ప్రస్తుతం ఈ రూట్ లో ఉన్న డిమాండ్ - అవసరాలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వందేభారత్ రైల్లో బెర్తులకు అవకాశం ఉండదు. కూర్చొని ప్రయాణం చేయాల్సి ఉండటంతో.. విజయవాడ వరకు పరిమితం చేయాలని అధికారులు ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నూతన సంవత్సరం నుంచి అందుబాటులోకి
అయితే, ఇప్పటికే సికింద్రాబాద్ టు విశాఖ, సికింద్రాబద్ టు తిరుపతి సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్ లతో నడుస్తున్న రైళ్ల అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో..మూడు లైన్లకు సంబంధించిన రద్దీ..అవసరాలను పరిగణలోకి తీసుకొని ఈ వారంలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ఈ మూడు ప్రతిపాదిత లైన్లలో రద్దీ అనూహ్యంగా ఉన్న విషయాన్ని అధికారులు రైల్వే శాఖకు నివేదించారు. రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ వీకే త్రిపాఠి కి రైల్వే మంత్రి ఏపీకి వందేభారత్ పైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటవుతుందా లేదా అనే సందేహాలకు సమాధానం దొరికింది. విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్ ఏర్పాటు కానుందని మంత్రి మరోసారి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications