హైదరాబాద్ - విశాఖ ఇక నాలుగు గంటల్లోనే : హైస్పీడ్ రైలు వచ్చేస్తోంది..!!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విశాఖకు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖ..అదే విధ:గా కర్నూలు నుంచి విజయవాడ వరకు ఈ హైస్పీడ్ రైలు కారిడార్ కు సంబంధించిన ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య హై స్పీడ్ రైలు కారిడార్
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ హైస్పీడ్ రైలు కారిడార్ పై తుది కసరత్తు జరుగుతోంది. ఈ హై స్పీడ్ కారిడార్ లో రెండు మార్గాలు ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి విశాఖ కు ఒక మార్గం కాగా.. రెండోది కర్నూలు నుంచి విజయవాడ కు కొనసాగేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ కారిడార్లలో గరిష్ఠంగా 220 కిలో మీటర్ల వేగంతో రైలు పరిగెత్తించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీరింగ్..ట్రాఫిక్ సర్వే ప్రారంభం కానుంది. ఈ హైస్పీడ్ కారిడార్ లో 220 కిలో మీటర్ల వేగంతో వెళ్లేలా నూతన లైన్లను నిర్మించాలనేది రైల్వే శాఖ ప్రతిపాదన. దీనికి సంబంధించి టెండర్లును ఇప్పటికే ఆహ్వానించారు. హై స్పీడ్ రైలు ఏ మార్గంలో అటు ప్రయాణీకులు..ఇటు రైల్వేకు ఆదాయం పరంగా కలిసి వస్తుందనేది అధ్యయనం చేసి సర్వే సంస్థ నివేదిక ఇవ్వనుంది.

నాలుగు గంటల్లో హైదరాబాద్ - విశాఖ
రైల్వే శాఖ ప్రాధమికంగా నిర్ణయించిన విధంగా హైదరాబాద్ - విజయవాడ- విశాఖ మార్గం శంషాబాద్ నుంచి ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడకు కొత్త హైస్పీడ్ మార్గం ఒక ప్రతిపాదనగా ఉంది. నల్గొండ..గుంటూరు..రెండో ప్రత్యామ్నయంగా పరిశీలన చేస్తున్నారు. కొత్తగా హైదరాబాద్ - విజయవాడ వయా సూర్యాపేట 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా కూడా తాజాగా మరో ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఇక..ప్రస్తుతం సికింద్రాబాద్ - విశాఖ మధ్య రైలు ప్రయాణం 12 గంటలుగా ఉంది. హైస్పీడ్ కారిడార్ ప్రణాళికలు కార్యరూపం దాల్చి అందుబాటులోకి వస్తే నాలుగు గంటల్లోనే సికింద్రాబాద్ - విశాఖ చేరుకొనే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

రాయసీమ నుంచి విజయవాడకు హై స్పీడ్
తాజాగా ప్రతిపాదిస్తున్న హై స్పీడ్ కారిడార్ లో మరో లైన్ చర్చకు వచ్చింది. విజయవాడ నుంచి కర్నూలు వరకు మరో హైస్పీడ్ కారిడార్ కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇది ఆచరణలోకి వస్తే కర్నూలు నుంచి విజయవాడ..అదే విధంగా అటు హైదరాబాద్..ఇటు విశాఖకు హైస్పీడ్ అందుబాటులోకి వస్తుంది. ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. దీంతో..ఇప్పటికే వందేభారత్ రైలు ద్వారా విశాఖ - సికింద్రాబాద్ మధ్య ప్రయాణీకులకు ప్రయాణ సమయం తగ్గింది. ఈ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే మరింతగా ప్రయాణ సమయం తగ్గటంతో పాటుగా సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా రైల్వే శాఖ ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications