తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు.. ఐఎండీ అలర్ట్..
గత కొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు, రేపు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో అల్పపీడనం, రుతుపవనాల ప్రభావం నేడు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో నేడు, రేపు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది.

తెలంగాణలో వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం బలహీనపడి, అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నేడు హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో గతకొన్ని కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, నిర్మల్, ఆసిఫాబాద్,భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు కురిసే ఉందని వివరించింది.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు..
ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి తీవ్రంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.2 అడుగులు చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 13.7 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.74 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రవాహాన్ని విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications