ఏపీని 'నిను వీడని నీడను నేనే' అంటున్న బంగాళాఖాతం
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వదిలిపెట్టడంలేదు. మూడు వారాల నుంచి రాష్ట్రం మొత్తం ముసురేసి ఉండగా రెండు రోజుల నుంచే భానుడు కనపడుతున్నాడు. ఆగస్టు మొదటివారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి మన్యం జిల్లాల్లో పిడుగులతో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలను వదర కష్టాలు చుట్టుముట్టాయి.
కుటుంబానికి రూ.3వేలు
రాజమండ్రి కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక నెంబరును జారీచేయగా, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక నెంబరును జారీచేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా మంత్రులంతా వదర ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు. వరదలవల్ల నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ.3వేల చొప్పున ప్రభుత్వం వదర సాయం చేస్తోంది. వ్యవసాయ, వాణిజ్య పంటలు నీటుమనగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా చేరుతున్న వరదనీరు
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు భారీగా చేరుకుంటోంది. దీంతో ఈనెల 30వ తేదీన గేట్లు తెరిచే ఏర్పాట్లను చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 13.34 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. కోనసీమలోని లంక గ్రామాలపై ఈ ప్రభావం మూడు రోజులు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సలాదివారిపాలెం, చింతపల్లి లంక, కూనాలంక, గురజాపులంక.. తదితర లంక గ్రామాల ప్రజలకు బయట ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్తు సిబ్బంది ప్రాణాలకు తెగించి విద్యుత్తును పునరుద్ధరిస్తున్నారు. 12 మండలాల పరిధిలోని 40 గ్రామాలు ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు 25 కేజీల బియ్యంతోపాటు ఆహార పొట్లాలను ప్రభుత్వం అందించింది.












Click it and Unblock the Notifications