సీఎంలు ఫ్రెండ్స్: బాబుతో రాజేంద్రప్రసాద్, పవన్ కళ్యాణ్ అలాకాదని మంత్రి
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రులిద్దరూ తనకు స్నేహితులన్నారు.
తాను ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. ఇద్దరు సీఎంలు తనకు మంచి స్నేహితులని చెప్పారు. కాగా, కొద్ది రోజుల క్రితం రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావును కూడా కలిశారు.

పవన్ కళ్యాణ్ రాజధాని వ్యతిరేకి కాదు: మంత్రి
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని వ్యతిరేకి కాదని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం అన్నారు. బలవంతంగా భూసేకరణ చేస్తే తాను వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారని మంత్రి చెప్పారు.
జూన్ నెలాఖరులోగా గోదావరి పుష్కరాల పనులు: యనమల
గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన వివిధ పనులు జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీ సహా విదేశీ ప్రతినిధులు, పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఐదువేలమంది గజ ఈతగాళ్లు, వెయ్యి బోట్లు, భారీగా ఫైరింజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications