రజనీ కి పెరిగిన ప్రాధాన్యత- రోజాకు పోటీగా : పార్టీలో - ప్రభుత్వంలో : సీఎం జగన్ లెక్కల వెనుక..!!
ఇద్దరూ ఇప్పుడు మహిళా మంత్రులే. ఇద్దరి మూలాలు ఒకే చోట నుంచే. ఇద్దరూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో...వైసీపీలో కీలకంగా మారారు. కీలక పదవుల్లో ఉన్నారు. కానీ, ఈ ఇద్దరు అనూహ్యంగా పార్టీలో కీలక చర్చకు కారణమయ్యారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో - ప్రభుత్వంలో కీలక మార్పులు - నిర్ణయాలు తీసుకున్నారు. 2024 ఎన్నికల కోసం తన సైన్యం సిద్దం చేసుకుంటున్నారు. అందులో ఇప్పుడు చిలకలూరిపేట నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన విడదల రజనీకి పెరుగుతున్న ప్రాధాన్యత వైసీపీలోనే కాదు..టీడీపీతో సహా పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ డిబేట్ కు కారణమైంది.

పార్టీలో ఆ ఇద్దరు మహిళా నేతలపైనే ఫోకస్..
వైసీపీ మహిళా నేతల్లో ఇప్పటి వరకు రోజా టాప్ పొజిషన్ లో ఉన్నారు. నాడు టీడీపీలో పదేళ్ల కాలం పని చేసిన సమయంలో...టీడీపీ ఫైర్ బ్రాండ్ గా వైఎస్సార్.. మెగా ఫ్యామిలీ పైన రోజా విరుచుకుపడేవారు. ఇక, వైసీపీలోకి వచ్చిన తరువాత అదే స్థాయిలో చంద్రబాబు- లోకేష్.. జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అవటమే తన కలగా చెప్పుకొచ్చిన రోజా..ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అనూహ్యంగా చివరి నిమషంలో మంత్రి పదవి దక్కించుకొని ఇప్పుడు జగన్ కేబినెట్ లో మంత్రి అయి..జిల్లాలో రాజకీయంగా సొంత పార్టీ - ప్రత్యర్ధి నేతలకు చెక్ చెప్పారు. టూరిజం శాఖ మంత్రి అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రుల నియామకంలో రోజా సమర్ధతకు గుర్తింపుగా టీడీపీ తమకు పట్టున్న ప్రాంతంగా చెప్పుకొనే క్రిష్ణా జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా జగన్ నియమించారు.

ఇద్దరికీ టీడీపీ మూలాలే...ఇప్పుడు టార్గెట్ అదే
అదే సమయంలో.. బీసీ మహిళగా విడదల రజనీ సైతం తొలి సారి ఎమ్మెల్యేగా ఉంటూనే..జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ దక్కించుకున్నారు. బీసీ మహిళకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో రజనీకి పాలనా పరంగా అనుభవం లేకపోయినా..జగన్ ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక, అంతటితో ఆగలేదు. ఇప్పుడు ఇంఛార్జ్ పదవుల్లో బాగంగా.. సీఎం జగన్ పరిపాలనా రాజధానిగా చేయాలని పట్టుదలతో ఉన్న విశాఖ బాధ్యతలు రజనీకి అప్పగించారు. విశాఖ జిల్లా వైసీపీ మంత్రులు ఎవరూ లేరు. కానీ, అక్కడ ఇంఛార్జ్ గా నియమించారంటే ఖచ్చింగా రజనీ సామర్ధ్యం పైన నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, గతంలో జగన్ కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నా.. వారు తమ పనికి తాము పరిమితం అయ్యేవారు. రోజా ఏ సభలో ఉన్నా...ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడాల్సిందే. పంచ్ లు.. ప్రసంగాలతో జోష్ తేవటంలో ముందుంటారు.

పార్టీలో - ప్రభుత్వంలో పెరుగుతున్న ప్రాధాన్యత
ఇక, విడదల రజనీ సైతం టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చారు. కానీ, ప్రసంగాల్లో ఆ జోష్ కనిపించదు. కానీ, తన వద్దకు సాయం కోరిన వచ్చిన వారికి మాత్రం అండగా నిలుస్తారనే పేరుంది. అదే సమయంలో సొంత జిల్లాలో కొందరు సొంత పార్టీ నేతలతో కోల్ద్ వార్ నడుస్తోంది. రోజా సైతం తన సొంత నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే, రోజాకు కీలక శాఖలు..కేటాయింపుల వెనుక తొలి నుంచి సామాజిక వర్గమే చిక్కుముడిగా మారుతోంది. అదే ఇప్పుడు రజనీకి కలిసి వస్తోంది. రాజకీయంగా రజనీ పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకొనే ప్రాంతంలో..పట్టు సాధించారు. అది కూడా రజనీకి ప్లస్ పాయింట్ గా మారింది. అయితే, ఇప్పుడు వైసీపీలో మాత్రం రజనీ - రోజా ఇద్దరూ కీలక చర్చకు కారణమయ్యారు.

సీఎం జగన్ లెక్క పక్కా..
పార్టీలో రోజా కు మంచి ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో రజనీకి పార్టీలో - ఇప్పుడు ప్రభుత్వంలో మంచి పట్టు సాధించారు. దీంతో..ఈ ఇద్దరి మధ్య రానున్న రోజుల్లో వైసీపీలో ఈ ఇద్దరి ప్రాధాన్యత..బాధ్యతల నిర్వహణ మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది. ఇద్దరూ మంత్రులు కావటంతో..ఇద్దరి పని తీరును పోల్చి చూడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, పార్టీ లో ఎవరి సేవలు ఏ రకంగా వినియోగించుకోవాలి...టీడీపీ లక్ష్యంగా రోజా - రజనీ అస్త్రాలు టీడీపీ పైన ఎలా ప్రయోగించాలనే అంశం పైన జగన్ లెక్క పక్కాగా కనిపిస్తోంది. అందులో చంద్రబాబు సొంత జిల్లాలో రోజా.. టీడీపీకి బలమైన ప్రాంతంగా చెప్పుకొనే ప్రాంతంలో రజనీ ఇప్పుడు కీలకంగా మారారు. అదే సమయంలో వీరిద్దరూ తమ సామర్ధ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.












Click it and Unblock the Notifications