సుష్మా పాత్ర మరువలేనిది: టీ బిల్లుపై రాజ్‌నాథ్
హైదరాబాద్: తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొందడంలో తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిదని, దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు. రెండు రాష్ట్రాలను కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు.
తెలంగాణతో పాటు సీమాంధ్రలను ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సలైట్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. దేశంలో సుపరిపాలన అందించే ఏకైక పార్టీ బిజెపి అని, ఈ విషయం తాను మాత్రమే చెప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అదే విషయం చెబుతున్నారని ఆయన అన్నారు.

తాము అధికారంలోకి రావడానికి తమ పార్టీ రాజకీయం చేయదని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తుందని ఆయన చెప్పారు. తాము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధమైన సమస్య రాలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంపై తమ పార్టీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. గుజరాత్ అభివృద్ధిని సోనియా గాంధీ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా ప్రశంసించిందని ఆయన అన్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సమస్య, విద్యుత్తు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు.
నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి సహకరించాలని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలంగాణ ప్రజలను కోరారు. ఇరు ప్రాంతాల అబివృద్ధి బాధ్యత కేంద్రంపై ఉంటుందని, బిజెపి అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను బిజెపి నెరవేర్చిందని ఆయన చెప్పారు.
అబివృద్ధికి మారు పేరు తమ పార్టీ అని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును భూస్థాపితం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణను బిజెపి మాత్రమే అభివృద్ధి చేయగలుతుందని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications