రామ్‌గోపాల్ వర్మ అప్పుడే మొదలెట్టేశారు! కమ్మ వాళ్ల హోటల్‌లో రెడ్లు పాగా వేశారంటూ..!
విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనం కోసం ఆయన ఏదైనా చేస్తారు. చేస్తున్నారు కూడా. మొన్నటి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై వెరైటీగా ట్వీట్లు సంధించారాయన. తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ మధ్య నెలకొన్న రాజకీయ పోరాటానికి కులాన్ని అపాదించారు. కమ్మ వాళ్ల రాజ్యంలో కడప రెడ్లు అంటూ సినిమా కూడా ప్రకటించేశారు. త్వరలోనే ఆ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
కమ్మ వాళ్ల హోటల్..నొవాటెల్..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి గురువారం ఉదయం బెజవాడకు చేరుకున్నారు రామ్‌గోపాల్ వర్మ. నగరంలోని నొవాటెల్ హోటల్‌లో దిగారు. అప్పటికే ఆ హోటల్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో క్రిక్కిరిసిపోయింది. హోటల్ గదులన్నీ బుక్ అయిపోయాయి. హోటల్‌లో అడుగు పెట్టిన వెంటనే- అక్కడంతా వైఎస్ఆర్ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఖద్దరు చొక్కాలతో కనిపించే సరికి.. ఆయన ఉండబట్ట లేకపోయారు. వెంటనే తన స్మార్ట్ ఫోన్ తీసి షూటింగ్ మొదలు పెట్టారు.

హోటల్‌లో నెలకొన్న సందడిని చిత్రీకరించారు. అనంతరం దాన్ని ఎడిట్ చేసి, తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కమ్మ వాళ్ల హోటల్ మొత్తం కడప రెడ్ల మయం అంటూ దానికి తనదైన శైలిలో ఓ కామెంట్ జత చేశారు. తాను తీయబోతున్న తదుపరి సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్‌కు హ్యాష్‌ట్యాగ్ జోడించి, వదిలారు. ఇప్పుడా వీడియో, ఆయన రాసిన కామెంట్ మరోసారి చర్చల్లోకి వచ్చింది.
రామ్‌గోపాల్ వర్మ.. ఇదే తొలిసారి..
రామ్‌గోపాల్ వర్మ ఓ రాజకీయ కార్యక్రమానికి ఇంత ఆసక్తిగా ఎదురు చూడటం, హాజరు కాబోతుండటం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఆయన రాజకీయ పార్టీల సమావేశాలకు గానీ, ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాలకు గానీ హాజరైన దాఖలాలు లేవు. తాను మొదటిసారి ఈ తరహా కార్యక్రమాలకు హాజరవుతున్నానని చెబుతున్నారు. అందుకే ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
నొవాటెల్ హోటల్ ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వహణలో ఉంది. ఈ హోటల్‌ను వారు లీజుకు తీసుకున్నారు. విజయవాడ లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికైన కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్‌లతో పాటు మరికొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ లీజులో భాగస్వామ్యులుగా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్‌గోపాల్ వర్మ.. తన సృజనాత్మకతకు పదును పెట్టారు. కమ్మ వాళ్ల హోటల్ మొత్తం కడప రెడ్ల మయం అంటూ కామెంట్ చేశారు.
KAMMA Vijayawada Novotel Hotel moththam KADAPA Redla mayam #KammaRajyamLoKadapaRedlu pic.twitter.com/gsuCkoIWci
— Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2019












Click it and Unblock the Notifications