నుదుట బొట్టు..నోట జైశ్రీరామ్: డిఫరెంట్‌గా చంద్రబాబు: అసలు టార్గెట్ వేరే?
అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆలోచనలు పాదరసం కంటే చురుగ్గా ఉంటాయని చెబుతుంటారు. అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేయడం, ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉక్కిరిబిక్కిరికి గురి చేసేలా వ్యూహలను పన్నుతుంటారని అంచనా వేస్తుంటారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు చంద్రబాబు రాజకీయ చాతుర్యానికి అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సంక్షోభ సమయాలను అవకాశంగా మార్చుకుంటూ ఉంటానని చంద్రబాబే స్వయంగా వెల్లడించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

అందివచ్చిన అవకాశంగా..
రాజకీయంగా ముందడుగు వేయడానికీ.. శతృవులను మిత్రులుగా మార్చుకోవడానికీ.. అధికార పార్టీ నేతలకు ఊపిరి సలపకుండా చేయడానికి అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని అంటున్నారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఏవీ లేవు. యాధృశ్ఛికంగా తలెత్తిన విగ్రహాల విధ్వంసం ఘటనలను తనుకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు బీజేపీ అధినేతల దృష్టిలో పడేలా చంద్రబాబు తనవంతు ప్రయత్నాలను సాగిస్తున్నారని అంచనాలు ఉన్నాయి.
విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించడాన్ని దీనికి తాజాగా ఉదాహరణగా చూపిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో అడుగు పెట్టలేకపోయిన చంద్రబాబు..
కారణాలు ఏమైనప్పటికీ.. మొన్నటిదాకా చంద్రబాబు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టలేకపోయారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల అనంతరం.. సుమారు 18 నెలల తరువాత ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంట్రీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువులు వెలువడిన 10 మందికి పైగా మృత్యువాత పడినప్పటికీ.. ఆయన బాధితులను పరామర్శించడానికి రాలేదు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించలేదు. పార్టీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టయిన సందర్భంలోనూ చంద్రబాబు ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికీ వెళ్లలేకపోయారు.

18 నెలల తరువాత..
ఈ 18 నెలల కాలంలో రాజకీయంగా, పరిపాలనా పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ.. ఆయన హైదరాబాద్‌లోని తన బంగళాను విడిచి బయటికి రాలేకపోయారు. రామతీర్థం ఉదంతాన్ని మాత్రం చంద్రబాబు చూస్తూ వదిలేయలేకపోయారు. ఉత్తరాంధ్రలో తన రీఎంట్రీ కోసం ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ప్రవేశించే సందర్భంలో ఆయన నుదుటన బొట్టు.. థమ్సప్ సింబల్ చూపిస్తూ కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బొట్టు.. థమ్సప్ సింబల్‌తో
నిజానికి- చంద్రబాబు బొట్టును ధరించిన సందర్భాలు చాలా చాలా అరుదు. అలాంటిది రామతీర్థం పర్యటనకు వెళ్తోన్న సమయంలో తిలకంతో కనిపించడం చర్చకు దారి తీసింది. అలాగే-విక్టరీ సింబల్‌కు బదులుగా థమ్సప్‌ను చూపించడం మారిన ఆయన హావభావాలను ప్రతిబింబింపజేసింది. రామతీర్థంలో జైశ్రీరామ్ అనే నినాదాన్ని వినిపించడం సైతం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

బీజేపీ నేతల కంట్లో పడేలా..
తన బాడీ లాంగ్వేజ్‌ను చంద్రబాబు మార్చుకున్నట్లు కనిపించడం ఒక ఎత్తయితే.. దాని వెనుక ఉన్న కారణం ఏమిటనేది మరో ఎత్తుగా కనిపిస్తోంది. ఒకటి- భారతీయ జనతా పార్టీకి చేరువ కావడానికి చేస్తోన్న ప్రయత్నాల్లో కనిపించాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తాను మారిన మనిషినని చేతల్లో చూపించినట్టయిందని అంటున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి, తప్పు చేశామనే అభిప్రాయాన్ని చంద్రబాబు కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడా తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా మారిన మనిషిననే సంకేతాలను బీజేపీ అధిష్ఠానానికి పంపించడానికి కొద్దో, గొప్పో ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్‌పై వ్యతిరేకత ఏర్పడేలా..
అదే సమయంలో-బీజేపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఉంచడానికి కూడా విగ్రహాల విధ్వంసం ఘటనలను అవకాశంగా చంద్రబాబు మార్చుకుంటున్నారని అంటున్నారు. వైఎస్ జగన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఘర్షణ వైఖరికి దిగట్లేదు. సామరస్యంగానే ఉంటున్నారు. అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులపైనా బీజేపీకి వైసీపీ ఎంపీలు జై కొట్టారు. అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ అధిష్టానం కూడా వైసీపీపై మెతక వైఖరినే కనపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ కంట్లో పడటానికే తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే- విగ్రహాల విధ్వంసం రూపంలో అనుకోకుండా లభించిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెబుతున్నారు.