ఇక తిరుపతి వేదకగా - మూడు రాజధానుల అంశంలో కొత్త మలుపు..!!
ఏపీలో కీలకంగా మారిన మూడు రాజధానుల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా ఇప్పటికే విశాఖ కేంద్రంగా గర్జన నిర్వహించారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వైసీపీ ఉత్తరాంధ్ర మంత్రులతో పాటుగా సీమ- కోస్తా ప్రాంతానికి చెందిన మంత్రులు మద్దతు ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. నేడు తిరుపతిలో రాయలసీమ ఆగ్మగౌరవ మహా ప్రదర్శన - బహిరంగ సభకు నిర్ణయించారు.
సీమ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో హాజరు కానున్నారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

క్రిష్ణాపురం ఠాణా నుంచి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. సీమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఈ ర్యాలీ కొనసాగనుంది. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమకు ద్రోహం చేయద్దని భూమన కోరారు. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. నవంబర్ 1న సుప్రీం కోర్టులో ప్రభుత్వం హైకోర్టు అమరావతికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు పైన దాఖలు చేసిన ఎస్సెల్పీ పైన విచారణ జరగనుంది. మూడు ప్రాంతాల సమానంగా అభివృద్ధి చెందాలనేదే తమ విధానమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అమరావతితో పాటుగా ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అధికార పార్టీ మంత్రులు చెప్పుకొచ్చారు. విశాఖలో గర్జన తరువాత, టీడీపీ సేవ్ విశాఖ పేరుతో కౌంటర్ వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పుడు తిరుపతి కేంద్రంగా ర్యాలీ..సభకు వచ్చే స్పందనకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.