బాలినేనితో పాటు అభ్యర్థుల సమక్షంలో ఒంగోలులో మళ్ళీ పోలింగ్!!
ఒంగోలు నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజక వర్గంలో పోలింగ్ నాడు ఉపయోగించిన ఈవీఎంలను రీ వెరిఫికేషన్ చేయాలని కోరారు.
బాలినేని అభ్యర్థనకు ఈసీ ఓకే.. ఈవీఎంల రీ వెరిఫికేషన్
దీనికి అంగీకరించిన ఎన్నికల కమిషన్ ఈనెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరిన విధంగా ఈవీఎంల పునః పరిశీలన చేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 12 పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బాలినేని అక్కడ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ మళ్ళీ రీ వెరిఫికేషన్ చేయాలని 5, 66,400 రూపాయలు జూన్ 10వ తేదీన చెల్లించారు.

12 పోలింగ్ బూత్లలో రీ వెరిఫికేషన్
ఇక బాలినేని అభ్యర్థనను అంగీకరించిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బెల్ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరిన విధంగా 12 పోలింగ్ బూత్లలో రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. తనకు పూర్తిగా మెజారిటీ వస్తుందని భావించిన పోలింగ్ బూతులలో తక్కువ ఓట్లు రావడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ రీ వెరిఫికేషన్ ను కోరారు. ఇక ఈ రీ వెరిఫికేషన్ కోసం అచ్చం ఓటర్లతో ఓట్లు వేయించిన ప్రాసెస్ ను డమ్మీగా చేయిస్తారు.
ఆ పోలింగ్ బూత్ లలో ఓటర్లతో రీ వెరిఫికేషన్ పోలింగ్
ఆయా పోలింగ్ బూత్ లో వాడిన ఈవీఎంలను వివి ప్యాట్లను తెప్పించి సాధారణ పోలింగ్ మాదిరిగానే ఓటర్ల చేత ఓట్లు వేయిస్తారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులను కూడా పిలిపించి బహిరంగ ఓట్ల విధానాన్ని అవలంబిస్తారు. అందరూ చూస్తుండగానే ఓటర్లు ఓట్లు వేస్తారు. అయితే వారు వేసిన ఓటు వారు ఓటు వేసిన వారి గుర్తుపైన నమోదవుతుందా లేదా వేరే పార్టీ గుర్తుపై నమోదవుతుందా అనేది అక్కడే పరిశీలిస్తారు.
రీ వెరిఫికేషన్ పోలింగ్ పై ఉత్కంఠ
దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. బెల్ కంపెనీకి చెందిన నిపుణుల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందని 19వ తేదీ నుంచి రోజుకు రెండు బూత్ లలో ఓటర్లతో ఓట్లు వేయించి రీ వెరిఫికేషన్ పోలింగ్ చేస్తారని చెబుతున్నారు. మొత్తం 12 బూత్ లలో రీ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. ఇక ఒంగోలు నియోజక వర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలలో రీ వెరిఫికేషన్ కోసం మళ్లీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠ గా మారింది.












Click it and Unblock the Notifications