సంక్రాంతికి ఏపీలో ఫుల్లు కిక్కు!!
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మద్యం కిక్కు బాగా పెరిగింది. పండగ సీజన్ కావడంతో విక్రయాలు పెరగ్గా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న కోడి పందేలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. దీనివల్ల రెట్టింపు స్థాయిలో మద్యం విక్రయాలు పెరిగాయి.
దుకాణాలవద్ద చాంతాడంత పొడవునా క్యూలున్నాయి. మూడురోజుల్లో 214 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. 83వేలకు పైగా బీర్ కేసులు, 2.33 లక్షలకు పైగా లిక్కర్ అమ్ముడుపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.27.81 కోట్ల మద్యం అమ్ముడుపోయి మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు నిలిచాయి. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ఏపీలో రూ.127 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కనుమ పండగకు ఇంకా భారీగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోడిపందేలు జరిగే బరులకు నేరుగా మద్యం బాటిళ్లు తీసుకొని వస్తున్నారు. పండగను పురస్కరించుకొని ప్రభుత్వం గంట అదనపు సమయాన్ని అమ్మకాల కోసం పెంచింది. మద్యం అమ్మకాలు కనుమను పురస్కరించుకొని మరింత పెరిగే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కోడిపందేలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. స్థానికులతో కలిపి వీరి సంఖ్య పెరగడంతో మద్యం అమ్మకాలు కూడా పెరిగి పశ్చిమ గోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. భోగి, సంక్రాంతికన్నా కనుమ పర్వదినం ముఖ్యమైంది. ఆ ఒక్కరోజు జరిగే మద్యం అమ్మకాలు రెండురోజుల అమ్మకాలతో సమానమని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications