అజ్ఞాతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి ఊరట-హైకోర్టు ముందస్తు బెయిల్
ఏపీలో ఓ ప్రైవేటు వెంచర్లో దౌర్జన్యం చేసిన వ్యవహారంలో నాన్ బెయిలబుల్ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. వైఎస్సార్ జిల్లాలోని చక్రాయపేటలో ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్ లో అక్రమంగా తవ్విన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ రవి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు వారం, పది రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
చక్రాయపేట కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే ఆయన అదృశ్యమయ్యారు. తొలుత హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ప్రైవేట్ విమానంలో చెన్నై వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఉన్నట్లుండి హైకోర్టులో ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ ఆయన అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

చక్రాయపేట వెంచర్ కేసులో బీటెక్ రవితో పాటు మొత్తం 32 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. వీరిలో 10 మంది దాకా అరెస్టులు కూడా చేశారు. బీటెక్ రవిని కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో తిరిగి పులివెందులకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో అయినా జగన్ కు పోటీ ఇచ్చేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పులివెందులకే చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కీలకంగా మారారు. దీంతో ఆయన్ను వైసీపీ నేతలు పోలీసుల సాయంతో టార్గెట్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో చక్రాయపేట వ్యవహారం అధికార పార్టీకి వరంగా మారింది. ఈ కేసులో బీటెక్ రవి అరెస్టు అయ్యే పరిస్ధితి ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఊరట పొందారు.












Click it and Unblock the Notifications