'కుదరదు: తిరుమలలో జగన్ డిక్లరేషన్ అవసరం లేదు'
హైదరాబాద్/చిత్తూరు/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన పైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గోపాల్ గవర్నర్ నరసింహన్‌కు నివేదిక ఇచ్చారు. జగన్ సంప్రదాయ దుస్తుల్లోనే శ్రీవారి దర్శనానికి వచ్చారని అందులో పేర్కొన్నారు. జగన్ డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
శ్రీవారిని దర్శించుకునేందుకు రోజుకు వేలాదిగా వస్తున్న అన్యమతస్తుల నుండి డిక్లరేషన్ తీసుకోవడం సాధ్యం కాదని, అనుమానితుల నుండి మాత్రమే డిక్లరేషన్ తీసుకుంటామని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. టిటిడి ఈవో నివేదికను బట్టి గవర్నర్ చర్యలు తీసుకోనున్నారు. గవర్నర్ ఆదేశానుసారం నివేదిక పంపామని ఈవో గోపాల్ తెలిపారు.
కాగా, ఆదివారం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.. శ్రీవారి ఆలయంలో నిబంధనల అతిక్రమణ జరిగిందా? లేదా? అనే అంశాలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులను వివరణ కోరారు.

ఆదివారం తిరుపతిలో జనభేరి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు నిబంధనలు అతిక్రమించినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు పాదరక్షలతో వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది గుర్తించి పాదరక్షలతో రాకూడదని చెప్పడంతో ఆయన అక్కడే ఆ పాదరక్షలు విడిచిపెట్టి దర్శనానికి వెళ్లారు.
అంతకన్నా ముఖ్యంగా అన్యమతస్తులు స్వామి వారిని దర్శించుకొనే ముందు వెంకన్నపై తమకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందని, హిందూ సాంప్రదాయం పట్ల విశ్వాసం ఉందని తెలియజేస్తూ టిటిడి సిద్ధం చేసిన రిజిస్టర్‌లో నమోదు చేసి సంతకం చేయాల్సి ఉంది. అయితే అలాకాకుండా జగన్ దర్శనానికి వెళ్లడంతో వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications