మాజీ మంత్రి సుచరిత భర్తకు జగన్ బంపర్ ఆఫర్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్తిపాడు శాసన సభ్యురాలు, హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఇదివరకు వార్తల్లో నిలిచారు. మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత ఆమె చాలాకాలం పాటు సొంత పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీపరంగా పెద్దగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. ఒకదశలో పార్టీని వీడతారనే ప్రచారం సైతం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఆ తరువాత పార్టీకి దగ్గరయ్యారు సుచరిత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెబుతూ వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. ఆయనను నవతరం ఫూలేగా అభివర్ణించారు. గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీపై ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తిప్పికొడుతూ.. వైసీపీలోనే కొనసాగుతున్నాననే సందేశాన్ని పంపించారు.

ఈ పరిణామాల మధ్య సుచరిత భర్త దయా సాగర్‌కు జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు మౌలిక వసతులు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవేన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రస్తుతం మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న డాక్టర్ వై విద్యా శంకర్‌ను రిలీవ్ చేశారు. ఆయన స్థానంలోో దయా సాగర్‌ను నియమించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్. 2022లో పదవీ విరమణ చేశారు. ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం దయాసాగర్‌ను మచిలీపట్నం పోర్ట్ ఎండీగా అపాయింట్ చేసింది.
మచిలీపట్నం పోర్ట్ నిర్మాణాన్ని వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే అంటే 2020 ఫిబ్రవరి 4వ తేదీన జగన్ ప్రభుత్వం.. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది.

తొలి విడతలో 5,156 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన పోర్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను సాధించింది ప్రభుత్వం. ఏప్రిల్‌లో కాలుష్య నియంత్రణ మండలి అనుమతులను సైతం లభించాయి. 1,923 ఎకరాల భూసేకరణను ఏప్రిల్ చివరి వారం నాటికి పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications