కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ ట్విట్టర్‌లవో తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నారా లోకేష్‌పై తెరాస నేత రామనర్సింహ గౌడ్ హైదరాబాదులోని ఎల్పీ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టిఆర్ఎస్ గుండాలు టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ నారా లోకేష్ ఇటీవల ట్విట్టర్‌లో ఆరోపించారు. అసలు రౌడీలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్ హిట్లర్‌లా పాలిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రమోట్ చేయడంలో బిజిబిజీగా గడుపుతుంటే కెసిఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను ప్రమోట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ తరుచుగా కెసిఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
కాగా, ఆంధ్రజ్యోతి దినపత్రిక తమను కించపరిచిందని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్ ఆరోపించారు. అమరులకు అన్యాయం చేస్తూ తమ జీతాలు పెంచారంటూ తప్పుడు వార్తను ప్రచురించిందని వారు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఆంధ్రజ్యోతి దినపత్రికపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని వారు తెలిపారు. కాగా, తనకు నోటీసు అందిన తర్వాత పరిశీలిస్తానని తెలంగామ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ చెప్పారు.












Click it and Unblock the Notifications