యాష్కీ హ్యాట్రిక్ కొట్టేనా? కవిత, యెండలతో హోరాహోరీ
నిజామాబాద్: తెలంగాణ తెచ్చామని, తెలంగాణ తమ వల్లే సాధ్యమైందని, తమ సహకారంతోనే తెలంగాణ వచ్చిందంటూ... నిజామాబాద్ లోకసభ బరిలో నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతున్నారు. నిజామాబాద్ లోకసభ బరిలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి మధుయాష్కీ, బిజెపి తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ, తెరాస తరఫున కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవితలు నిలబడ్డారు.
ముగ్గురు అభ్యర్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారే. తెలంగాణ కోసం యాష్కీ సొంత పార్టీ పైనా నిప్పులు చెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వడంతో అదే ఆయుధంగా ఆయన దూసుకెళ్తున్నారు. తెరాస వల్లే తెలంగాణ వచ్చిందని కవిత చెబుతున్నారు. బిజెపి మొదటి నుండి తెలంగాణకు కట్టుబడి ఉందని, తమ సహకారం లేకుంటే తెలంగాణ సాధ్యం కాకపోయేదని యెండల అంటున్నారు.

ముగ్గురు అభ్యర్థులు పోటా పోటీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతోనే వారు తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. యాష్కీ 2004, 20009 ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ విషయంలో సొంత పార్టీకి చెందిన ముఖ్య నేతల పైనా బాహాటంగా విమర్శలు చేస్తూ, కరడుగట్టిన తెలంగాణవాదిగా ముద్ర వేసుకున్నారు. జిల్లాలో గత ఎన్నికల్లో పిసిసి చీఫ్ హోదాలో పోటీ చేసిన డి శ్రీనివాస్‌తో పాటు మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు మట్టికరిచినా యాష్కీ విజయం సాధించారు.
జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కూడా తక్కువ మెజార్టీతో గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో యాష్కీ గెలిచారు. ఈసారి కూడా తనదే గెలుపు అని ధీమాతో ఉన్నారు. మరోవైపు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని సైతం తృణప్రాయంగా వదిలిన యెండల గెలుపుపై ధీమాతో ఉన్నారు.
2009 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి తరఫున పోటీ చేసిన యెండల.. డిఎస్‌ను ఓడించారు. ఇప్పుడు యాష్కీని ఓడించి చరిత్ర సృష్టిస్తానని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చి రాజీనామాల పర్వం తెరపైకి రావడంతో, ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినప్పటికీ యెండల స్వచ్ఛందంగానే రాజీనామా చేశారు. 2010లో అర్బన్ సెగ్మెంట్‌కు నిర్వహించిన ఉప ఎన్నికలో మళ్లీ డిఎస్ పైన యెండల గెలిచారు.
తెలంగాణవాదానికి తోడు మోడీ ప్రభంజనంతో ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడిన కల్వకుంట్ల కవిత నిజామాబాదులో గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆమె మెట్టినిల్లు కావడంతో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మొదటి నుండి ఈ ప్రాంతంలో విరివిగా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల దృష్టిని ఆకర్షించారు.












Click it and Unblock the Notifications