వెకిలి నవ్వులు, ఎక్కడ దాక్కున్నారు - ఆ దమ్ముందా..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పది నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం మే నెల నుంచి హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం నొక్కిన బటన్ల కన్నా తాము ఇస్తున్న పెన్షన్లు ఎక్కవంటూ తాజాగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అటు మాజీ సీఎం జగన్ స్థానిక సంస్థల బైపోల్స్ లో గెలిచిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. ఇక, వైసీపీ మాజీ మంత్రులు ప్రభుత్వం పైన గురి పెట్టారు. హామీల అమలు పైన వరుసగా నిలదీస్తున్నారు.
పెన్షన్ల తొలిగింపు
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. రెవెన్యూ సంబంధిత వ్యవహారాల్లో మాజీ మంత్రులు ఆరుగురు ప్రమేయం ఉన్నట్లు రెవిన్యూ శాఖ నివేదిక ఇచ్చింది. అటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ వ్యవహారంలో విచారణకు రావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ సమయంలో మాజీ మంత్రి రోజా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. కూటమి అధికారం లోకి వచ్చి పది నెలలు అయినా.. ఇప్పటి వరకు పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీసారు.

హామీలు అమలు ఎక్కడ
పెన్షన్ల అమల్లోనూ కూటమి ప్రభుత్వం మూడు లక్షల మందికి కోత వేసిందని రోజా ఆరోపించారు. ప్రతీ నెలా పెన్షన్లే ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేసారు. మహిళల ఉచిత బస్సు రోడ్డెక్కలేదని వ్యాఖ్యానించారు. తల్లికి వందనం అందరికీ ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. మహిళలు, నిరుద్యోగులను ఫూల్స్ చేసారని వ్యాఖ్యానించారు. తొలి ఏడాదిలో లక్షా 52 వేల కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రోజా ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పి.. అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు చేసి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే మాటలకు.. చేతలకు పొంతన ఉందా అంటూ రోజా నిలదీసారు.
పవన్ దాక్కున్నారా
ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారని ఎద్దేవా చేసారు. వాలంటీర్లు, నిరుద్యోగులను ఫూల్స్ చేసారని విమర్శించారు. సూపర్ సిక్స్ ఇవ్వటం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోలు బంకులు.. షాపుల వద్ద ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే బెల్టు షాపులు ఉన్నాయని విమర్శించారు. పీ-4 వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందని చెప్పకొచ్చారు. మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతుంటే వెకిలి నవ్వులు నవ్వుకుంటూ పవన్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications