మీకు తెలుగూ, ఇంగ్లీష్ అర్ధం కావా ? ఏమీ చేయలేవు-షర్మిలకు రోజా ఘాటు కౌంటర్..!
ఏపీలో గత వైసీపీ హయాంలో సౌర విద్యుత్ కోసం సెకీతో చేసుకున్న ఒప్పందం వివాదాస్పదమైన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇంత చౌకగా విద్యుత్ కోసం తాను ఒప్పందం చేసుకుంటే అదానీ పేరుతో తనను వివాదంలోకి లాగుతున్నారని ప్రత్యర్థులపై మండిపడ్డారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లు భావిస్తున్న తరుణంలో ఇవాళ ఎంట్రీ ఇచ్చిన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తిరిగి అన్నపై విమర్శలు మొదలుపెట్టేశారు. వీటికి వైసీపీ నేత రోజా ఘాటు కౌంటర్ ఇచ్చారు.
షర్మిల గారూ.. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న గారు రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్ గారి మీద బురద జల్లుతున్నారంటూ ఆర్కే రోజా ఇవాళ ట్వీట్ చేశారు.
2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? 2.14 పైసలకు ఎక్కడ అమ్మిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ప్రశ్నించారు.

అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదని, గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్‌లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయని రోజా గుర్తుచేశారు. అదానీతో ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదని, 2021, సెప్టెంబరు 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మనకు అంతకు ముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్ అంటే రూ.2.49 కే తమ మార్జిన్‌తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా అని రోజా ప్రశ్నించారు.
గుజరాత్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, సోలార్ పవర్ రూ.1.99కి కానీ, రూ.2.10 కానీ వచ్చినా అది మన రాష్ట్రానికి ట్రాన్స్‌పోర్టు చేసే సరికే ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జ్ మరో రూ.1.98 కూడా పడుతుందని రోజా గుర్తుచేసారు. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుందన్నారు. ఈ విషయం మీకు తెలియదా? అని షర్మిలను ప్రశ్నించారు. సెకీ మనకు ఇన్సెంటివ్‌గా, ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జెస్ (ఐఎస్‌టీఎస్) మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ రూ.2.49లకే వస్తోందన్నారు.
గుజరాత్ లో యూనిట్ రూ.1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారని, ఎక్కడ కన్జూమ్ చేస్తున్నారన్నది చూస్తే మాన్యుఫాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్. అమ్మే డిస్కంలు.. మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనే వాళ్లు. అక్కడే మాన్యుఫాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టే వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీకు తెలియదా అని షర్మిలను రోజా కడిగేశారు. ఇదే సెకీ, ఇదే ఆత్మ నిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్‌గఢ్‌కు కూడా రూ.2.61కి అమ్మిందని, విద్యుత్ ధర కూడా 12పైసలు తగ్గిందని, వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్‌పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్లు తిరుగుతాయని, పవన విద్యుత్ పీపీఏలు చూస్తే.. 2014-19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. రూ.4.84 నుంచి రూ.4.83వరకు. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చిందని రోజా తెలిపారు. సోలార్‌కు సంబంధించి 2500 మెగావాట్లకు ఆయన పీపీఎలు చేసుకున్నారని, 2014లో 650 మెగావాట్లు సగటున రూ.6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని గుర్తుచేశారు.
2015లో రూ.5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50కి కొనుగోలు చేశారని తెలిపారు. సోలార్ ఎనర్జీని యావరేజ్‌గా రూ.5.90కి కొనుగోలు చేశారన్నారు. మరి మా ప్రభుత్వం యూనిట్ రూ.2.49కు కొంటే అది పెద్ద తప్పా? అది పెద్ద నేరమా? చంద్రబాబు యూనిట్ రూ.5.90లకు కొంటే మంచివాడు, జగన్ రూ.2.49లకు కొంటే చెడ్డవాడా? ఇదెక్కడి న్యాయం? అని అడిగారు. మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటి లక్ష్యం జగన్ గారే. మీరు కోరుకుంటున్నది ఆయన పతనం. మీరు ఎన్ని కోరుకున్నా జగన్ కు ప్రజలు అండగా ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications