నాడు ప్రధాని - సీఎం జగన్ ను గెలిపించాయి : ఇప్పుడు చంద్రబాబు - గెలుపు ధీమా అదే..!!
Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ముందస్తుగానే సిద్దం అవుతున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలతో కేడర్ లో జోష్ పెంచుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కొత్త నినాదాలు - చర్చలు ఇంట్రస్టింగ్ గా మారాయి. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ -2019 ఎన్నికల్లో జగన్ గెలుపుకు దోహదం చేసిన అంశాలనే ఇప్పుడు చంద్రబాబు ఫాలో అవుతున్నారు. వినూత్నంగా ప్రజల మధ్య చర్చల్లో నిలుస్తున్నారు. వంద శాతం గెలుపు టీడీపీదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సక్సెస్ అవుతారా.

నాడు ప్రధాని - సీఎం జగన్ రూటులోనే..
2014లో ప్రధాని అభ్యర్ధిగా మోదీ ప్రచారంలోకి దిగారు. ఆ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెర వెనుక కీలక పాత్ర పోషించారు. కొత్త నినాదాలు - చర్చల తో ప్రధానికి ప్రజల మధ్య సత్సంబంధాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఛాయ్ పే చర్చ, ఆప్ కా సాత్ - ఆప్ కా లీడర్ వంటి నినాదాలతో సామాన్యలకు దగ్గరయ్యేలా చేసారు.
సోషల్ మీడియా ద్వారా యువతకు మోదీ దగ్గరయ్యేలా వ్యవహరించారు. ఆ తరువాత 2019 ఎన్నికల సమయంలో జగన్ గెలుపు కోసం అదే ప్రశాంత్ కిషోర్ కొత్త వ్యూహాలతో జగన్ వెనుక నిలిచారు. జగన్ ఎన్నికల నినాదాలు..సామాజిక వర్గాలతో సమావేశాలు ..వ్యూహాత్మక ప్రకటనలతో సూచనలు చేసారు.
బైబై బాబు స్లోగన్ ఆ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపింది. ఏపీలో ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్ధి పార్టీల పైన 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది. వీటన్నింటితో పాటుగా జగన్ హవా ఆ ఎన్నికల్లో కలిసొచ్చి ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు.

చంద్రబాబు పర్యటనల్లో కొత్త మార్పులు..
ఇప్పుడు చంద్రబాబు జిల్లా పర్యటనల్లో కొత్త అంశాలు కనిపిస్తున్నాయి. గతం కంటే భిన్నంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకంగా వ్యవహరించిన రాబిన్ శర్మ ఇప్పుడు టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు. కొత్త నినాదాలు - కార్యక్రమాలను సూచిస్తున్నారు.
వచ్చే ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకం కావటంతో అనుభవం ఉన్నా..సలహాదారు నియామకంలో చంద్రబాబు ముందుకే వెళ్లారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు కౌంటర్ గా కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి టీడీపీ నేతలు వస్తున్నారు. వైసీపీ నమ్ముకున్న పాజిటివ్ ప్రచారానికి కౌంటర్ గా పూర్తిగా స్థానిక సమస్యలతో కౌంటర్ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలకు ముందుగానే రాబిన్ శర్మ టీంలు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి.
ఏ అంశాల పైన ప్రజల్లో చర్చ ఉందనేది ఆరా తీస్తున్నాయి. చంద్రబాబు ప్రసంగాల్లో ఆ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడేలా వ్యవహరిస్తున్నారు. దీంతో, గతం కంటే భిన్నంగా చంద్రబాబు ప్రసంగాల్లో మార్పు కనిపిస్తోంది. మూస ధోరిణికి భిన్నంగా జోష్ నింపే స్పీచ్ లు చంద్రబాబు పర్యటనల్లో కనిపిస్తున్నాయి.

వైసీపీ ఓట్ బ్యాంకు పై గురి - కీలక భేటీలు
వైసీపీకి గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఓట్ బ్యాంకుల పైన చంద్రబాబు - రాబిన్ శర్మ గురి పెట్టారు. అదే సమయంలో కొత్త నినాదాలు - కొత్త చర్చల పేరుతో చంద్రబాబు ఎంపిక చేసిన వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రధాని మోదీ - సీఎం జగన్ గెలుపుకు దోహదం చేసిన అంశాలను ఇప్పుడు అమలు చేస్తున్నారు.
చంద్రబాబు తన పర్యటనల్లో ఛాయ్ పే చర్చ నిర్వహిస్తున్నారు. ముస్లిం మైనార్టీలతో చర్చల కోసం తాజాగా బాత్ చీత్ విత్ బాబు కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. అర్బన్ ప్రాంతాల్లో త్వరలో మీట్ యువర్ లీడర్ కార్యక్రమం నిర్వహణకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక ఉందని పెద్ద ఎత్తున ప్రచారంతో కొత్త మైండ్ గేమ్ అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల హామీలను చివరి నిమిషం వరకు బయట పెట్టకూడదని నిర్ణయించారు. పొత్తుల అంశంలో ఎవరూ మాట్లాడవద్దని సూచించారు.
ఎన్నికల సమయంలోనే పొత్తుల పైన చంద్రబాబు మాత్రమే స్పందిస్తారని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. దీంతో, ప్రభుత్వ వ్యతిరేకత- తాజా వ్యూహాలు తన గెలుపుకు దోహదం చేస్తాయని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. సామాజిక సమీకరణాలపైన వైసీపీకి కౌంటర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. మరి..ఇవన్నీ చంద్రబాబుకు తిరిగి అధికారం దగ్గర చేస్తాయా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications