టీడీపీ రికార్టు విజయం వెనుక రాబిన్ శర్మ చేసింది ఇదే..! షోటైమ్ స్ట్రాటజీ వెల్లడి..
ఏపీలో ఈసారి టీడీపీ సాధించిన చారిత్రక విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని స్ధాయిలో టీడీపీ అందుకున్న విజయం వెనుక ఉన్న చోదకశక్తి, వ్యూహకర్త రాబిన్ శర్మ. ఆయన సంస్థ షోటైమ్ కన్సల్టింగ్ ఐదేళ్లుగా టీడీపీ కోసం పడిన శ్రమ ఫలితంగా మారి ఇప్పుడు జాతీయ స్ధాయిలో చర్చకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో షోటైమ్ సంస్థ టీడీపీ విజయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో టీడీపీ విజయం వెనుక తమ శ్రమను వెల్లడించింది.
2019 ఎన్నికల్లో 23 సీట్ల పరాజయం తర్వాత చంద్రబాబు తమ పార్టీ టీడీపీని గాడిన పెట్టడానికి షోటైమ్ కన్సల్టింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు ఆ పార్టీకి చాలా సమయమే పట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉపఎన్నికలు ఇలా వరుస పరాజయాలు వెంటాడాయి. ఓ దశలో రాబిన్ శర్మ పనితీరుపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పరిస్ధితులు వేగంగా మారాయి.

చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ మద్దతు, ఎన్డీయే కూటమి ఏర్పాటు వంటి పరిణామాలు, వాటిని సద్వినియోగం చేసుకుంటూ తెరవెనుక షోటైమ్ కన్సల్టింగ్ వేసిన వ్యూహాలు ఫలించాయి. సెంట్రల్ కమాండ్ కంట్రోల్, వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని షోటైమ్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం వ్యూహాలు రచించింది. 200 మందికి పైగా సుశిక్షితులైన సిబ్బంది, 175 నియోజకవర్గాలకూ ఆఫీస్ బేరర్లను నియమించింది. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేక వ్యూహాల్ని రచించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు వార్ రూమ్ కు తెలియజేస్తూ అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేసింది.
క్షేత్రస్దాయిలో 1400 మందికి పైగా సిబ్బంది అన్ని నియోజకవర్గాల్లో కలిపి పనిచేసారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా ప్రతీ వర్గాన్ని టీడీపీవైపు మళ్లించేందుకు శ్రమించారు.ముఖ్యంగా 14 లక్షల తటస్థ ఓటర్లను టీడీపీవైపు తిప్పడంలో సక్సెస్ అయ్యారు. చివరిగా టీడీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను జనాల్లోకి తీసుకెళ్లి పూర్తిగా వారిని కూటమికి అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయింది.
దర్శి ప్రజాగళం సభలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం కాపీని చంద్రబాబు చించేయడం, దీనికి వ్యతిరేకంగా ఏకకాలంలో పలు వ్యూహాలు రచించి వాటిని క్షేత్రస్ధాయిలో పక్కాగా అమలు చేసింది. ఏకకాలంలో చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు వీరి కుటుంబ సభ్యుల్ని క్షేత్రస్థాయికి పంపి వారితో పలు ప్రచారాలు చేయించింది. వీటికి యువగళం, ప్రజాగళం, నిజం గెలవాలి వంటి పేర్లు పెట్టి జనంలోకి పంపింది. ఇలా వివిధ మార్గాల్లో షోటైమ్ వేసిన వ్యూహాలు ఫలించి టీడీపీ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందుకుంది.












Click it and Unblock the Notifications