పవన్ కళ్యాణ్ వ్యాఖ్యను గుర్తు చేసి చంద్రబాబును ఏకేసిన రోజా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అయినా, ప్రభుత్వమైన కులాలకు అతీతంగా ఉండాలంటూ ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దొంగతనం చేసి పట్టుబడ్డారంటూ ఆమె మండిపడ్డారు. తాను చట్టానికి అతీతుడనని, తాను ఏం చేసినా ప్రశ్నించకూడదనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.
చంద్రబాబు ప్రవర్తన విచిత్రంగా ఉందని, దొంగతనం తప్పు కానీ చంద్రబాబు చేస్తే తప్పు కాదు, అవినీతి తప్పు గానీ చంద్రబాబు లంచం తీసుకుంటే తప్పు కాదు, ఫోన్ ట్యాపింగ్ తప్పు గానీ చంద్రబాబు చేస్తే తప్పు కాదు అనే పద్ధతిలో చంద్రబాబు ప్రవర్తన ఉందని ఆమె అన్నారు. ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు వెధవ్వేషాలు వేస్తున్నారని, మహిళల సాధికారతను దెబ్బ తీస్తున్నారని ఆమె విమర్శించారు. మహిళలు తల దించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. వెధవ్వేషాలు వేస్తే ఎవరి తాటనైనా చంద్రబాబు తీస్తారని ఎన్నికలకు ముందు ప్రకటనలు ఇప్పించుకున్నరాని, చంద్రబాబే వెధవ్వేషాలు వేస్తున్నారని, చంద్రబాబు తాట ఎవరు తీస్తారని ఆమె అన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలను, డ్వాక్రా మహిళలను కొట్టించాడని ఆమె ఆరోపించారు. వీధివీధినా మద్యం అమ్ముకోవడానికి అనుమతలిచ్చారని ఆమె అన్నారు.
రాజధాని విషయంలో రైతులను ఇబ్బంది పెట్టబోనని చంద్రబాబు అన్నారని, అయితే తనకు జరిగిన అన్యాయాన్ని ఓ మహిళ మీడియా ముందు చెప్తే పోలీసుల చేత బెదిరింపజేసి, నోరు నొక్కేశాడని ఆమె చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనికి ఏం సంబంధం లేకున్నా అనురాధను నిఘా విభాగం చీఫ్‌గా తొలగించారని, తాను తప్పు చేసిన చంద్రబాబు అది అనురాధ తప్పుగా చిత్రీకరించారని ఆమె అన్నారు.

శాసనసభ్యురాలు, చిన్నపిల్ల అఖిలప్రియకు తోడుగా తండ్రి భూమా నాగిరెడ్డి వస్తే, ఆమె రక్షణ కోసం వస్తే కేసు పెట్టించారని ఆమె ఆరోపించారు. పోలీసు డ్రెస్ వేసుకున్నవాడికి కులం ఉంటే, సిఎం కూడా కులం చూస్తే ఈ ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ మద్దతుదారులకు, సానుభూతిపరులకు పింఛన్లు రాకుండా చేశారని ఆమె విమర్శించారు.
తమ పార్టీ శాసనసభ్యులపై తప్పుడు కేసులు పెట్టారని, కార్యకర్తలకు చెప్పి తనపై ఎస్సీఎస్టీ కేసులు పెట్టించారని ఆమె అన్నారు. మహిళ రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా, ఇంటిలిజెన్స్ చీప్‌గా ధైర్యంగా ఉండకూడదనేది చంద్రబాబు ఉద్దేశమని ఆమె అన్నారు. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో అదే జరిగిందని ఆమె అన్నారు. ఎమ్మార్వోకే రక్షణ లేకపోతే మిగతావారి సంగతేమిటని ఆమె అడిగారు.
వనజాక్షిపై దాడి చేసిన శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై చాలా కేసులున్నాయని, ప్రణాళిక ప్రకారం వనజాక్షిపై దాడి చేశారని ఆమె అంటూ చింతమనేని ప్రభాకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ముగ్గురు మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
దొంగలను, అధికారులను, పోలీసులను కూర్చోబెట్టుకుని చంద్రబాబు వనజాక్షి వ్యవహారంలో సెటిల్‍మెంట్ చేశారని, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా పనికి వస్తారని రోజా అన్నారు. వనజాక్షి భయపడి కారులో వెళ్లిపోయారని ఆమె ్న్నారు. మంత్రులు, శాసనసభ్యులు తప్పు చేసినా తాను రక్షిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారని ఆమె అన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ తప్పు అన్న చంద్రబాబు తాను చేస్తే తప్పు కాదని అంటున్నారని, తాను ట్యాప్ చేయడానికి టెక్నాలజీని కొనుగోలు చేస్తే తప్పు కాదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడని ఆమె అన్నారు. ఏ చట్టం ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్నారని ఆమె చంద్రబాబును అడిగారు. ఈ వ్యవహారంపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
తాను తప్పు చేసి దొరికిపోయి, చంద్రబాబు ఇప్పుడు సెక్షన్ 8 కావాలంటున్నారని, అందుకు అందరినీ కలిసి రావాలని అడుగుతున్నారని, చంద్రబాబు చేసిన తప్పుతో అంధ్రులు అవమానానికి గురవుతున్నారని, తనకు మద్దతివ్వాలంటూ మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆమె అన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడితే కూడా సెక్షన్ 8 కావాలంటారేమో అని ఆమె ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నారని, సిఎం సొంత జిల్లా చిత్తూరులో నారాయణమ్మ అనే మహిళపై సర్పంచ్ దాడి చేశాడని ఆమె చెప్పారు. వనజాక్షిపై దాడి చేసిన చింతమనేనిని వదిలిపెట్టకూడదని ఆమె అన్నారు. చింతమనేనితో రాజీనామా చేయించి, మిగతా కేసులతో పాటు వనజాక్షిపై దాడి కేసుపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications