రూ.500, రూ.1000 నోట్ల ఎఫెక్ట్: మోడీ దెబ్బకు 'అమరావతి'లో వారు గిలగిల!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, సమీపంలోని కృష్షా, గుంటూరు జిల్లాల పైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం బాగా పడిందని అంటున్నారు. అమరావతి రాజధాని అయ్యాక గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో చాలామంది వద్ద కట్టల కొద్ది రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయని, ఇప్పుడు వారు నెత్తి నోరు మొత్తుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అమరావతి రాజధాని అయ్యాక విజయవాడ నగర శివారులో ఎకరం పొలం రూ.21 కోట్లకు చేరింది. భూముల విలువ క్రమంగా పెరుగుతూనే ఉంది. మరోవైపు కొందరు నిర్మాణాలు చేపట్టారు. సీఆర్డీఏ అనుమతులు లేకపోవడంతో అవి ఆగిపోయాయి. ఈ విధంగా కూడా చేతిలో ఉన్న డబ్బుతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.
బిల్డర్ల వద్ద నల్లధనం
కొందరు బిల్డర్ల వద్ద వేల కోట్ల నల్లధనం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారు ఇప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారట. కొందరి వద్ద ఏకంగా కోట్లాది రూపాయలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారుల్లో అలజడి కనిపిస్తోందంటున్నారు.
కాల్ మనీ వ్యాపారుల్లోను..
కాల్ మనీ వ్యాపారుల్లోను ఆందోళన కనిపిస్తోందంటున్నారు. వారు చిన్న వ్యాపారులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుంటారు. ఇలాంటి కాల్ మనీ వ్యాపారులు తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉంచుకుంటారు. ఇప్పుడు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో బ్లాక్ మనీ ఉన్న వారిలో గుబులు పట్టుకుంది. వందల కోట్ల రూపాయల వరకు కాల్ మనీ వ్యాపారుల వద్ద డబ్బు ఉండవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications