నర్సాపురంలో జగన్ భారీ స్కెచ్ - రఘురామ పై పోటీకి ఐఏఎస్ : ఆటమొదలైంది..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తన ఎంపీ పదవికి రాజీనామాకు సిద్దమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ తరువాత రాజీనామా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే సర్వేలు చేయించారు. తన గెలుపు ఖాయమని.. మెజార్టీయే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు. తనకు అన్ని పార్టీలు -వర్గాలు మద్దతివ్వాలని కోరుతున్నారు. దీంతో..ఇప్పటి వరకు రఘురామ రాజీనామా చేసి..నర్సాపురంలో బైపోల్ వస్తే ఏం చేయాలనే అంశం పైన వైసీపీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. కానీ, అంతర్గతంగా మాత్రం వైసీపీ నర్సాపురంలో భారీ స్కెచ్ తో సిద్దం అవుతోంది.

సీఎం జగన్ పక్కా వ్యూహంతో
ముందుగా రఘరామ రాజీనామా చేయాలి కదా అంటూ ఆయన రాజీనామా విషయంలో వెనక్కు పోకుండా మైండ్ గేమ్ అప్లై చేస్తోంది. రాజీనామా చేసినా.. స్పీకర్ ఆమోదం పైన వైసీపీలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఆమోదించిన సమయం నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో..ఆ సమయంలోగా ఎక్కడా తమ వ్యూహాలు బయట పడకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది.
అయితే, నర్సాపురంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఏ పార్టీ మద్దతిచ్చినా రఘురామ అభ్యర్దిగా ఉండనున్నారు. దీంతో..ముందుగా వైసీపీ సైతం తమ అభ్యర్ధి ఎవరుండాలనే దాని పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ఐఏఎస్ ను బరిలో దింపటం ద్వారా
తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేసిన విధంగానే...నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ ఎంవీజీకే భాను రంగంలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. 1985 బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారిగా అస్సోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు.
1958లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించిన భాను డైనమిక్ అధికారిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి కూడా ప్రశంసలు పొందిన నోబుల్ అధికారి. అత్యంత ప్రభావవంతమైన అధికారులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. 1990 లో విజయవాడ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా పని చేసారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన కార్యదర్శి గా వ్యవహరించారు.

సామాజిక సమీకరణంలో భాగంగా
ప్రధానమైన ఇరిగేషన్ వ్యవహారాల్లో ఆయన వైఎస్సార్ కు కుడిభుజంగా పని చేసారు. ఆ తరువాత రోశయ్య వద్ద కార్యదర్శిగా ఉండేవారు. 2019 వరకూ అసోం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తేజ్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
2018లోనే ఆయన పదవీ విరమణ చేసారు. ఇక, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన భాను నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లో బరిలోకి దించే అంశం పైన ఇప్పటికే వైసీపీ సర్వేలు సైతం చేయించినట్లు సమాచారం.

రఘురామ రాజీనామా తరువాతే..
సర్వేలో సానుకూల ఫలితాలు రావటంతో..ఆయనే వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న ఏ నేతనైనా ఇప్పుడ అక్కడ అభ్యర్దిగా బరిలో దించటం కంటే... రిటైర్డ్ ఐఏఎస్ ను దించటం ద్వారా ప్రజల్లోనూ సానుకూలత ఉంటుందని భావిస్తున్నారు. ఇక, నర్సాపురంలో గెలుపు బాధ్యతలను క్షత్రియ - కాపు వర్గానికి చెందిన మంత్రులకు అందిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు రఘురామకు మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉండటంతో..ఇటు వైసీపీ సైతం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఎక్కడా ఎటువంటి అతి విశ్వాసం.. పొరపాటుకు అవకాశం లేకుండా అభ్యర్ధి ఎంపిక నుంచే నర్సాపురం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. దీంతో..రఘురామ చెప్పిన విధంగా రాజీనామా చేయటంతోనే నర్సాపురంలో రాజకీయంగా ఆట మొదలు కానుంది.