కుప్పంలో దొంగ ఓట్లు..మాఫియా డబ్బు : ఎన్నికల కమిషన్ ఉందా.. చేతకాక పోతే వెళ్లిపోండి : చంద్రబాబు ఫైర్..!!
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తీరు పైన టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే రకంగా దౌర్జన్యాలు కొనసాగిస్తే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారిని పట్టిచ్చినా చర్యలు లేవన్నారు. దొంగ ఓట్లు పైనా తమ పార్టీ నేతలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఆధారాలు ఇచ్చారని చెప్పారు. కుప్పంతో పాటుగా అనేక ప్రాంతాల్లో మాటల్లో చెప్పలేని విధంగా అధికార పార్టీ అరాచకం చేస్తోందని మండిపడ్డారు.

పోలీసు వ్యవస్థ ఉందా
అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పంలో ఓటర్లు చైతన్యవంతులని చెప్పుకొచ్చారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువతను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తూ ..వారి భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
ఎన్నికల ను అపహాస్యం చేయడం చరిత్రలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు.
దొంగ ఓటర్లకు వాలంటీర్ల సహకారం
పోలీసులు సైతం దొంగలకు వంత పాడుతున్నారన్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ వలంటీర్లే దొంగ ఓటర్లని బూత్‌లకు తీసుకొస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు. ఎప్పుడూ ఇదే తరహాలో అరాచకం కొనసాగుతుందని అనుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు.
జగన్ పాలనలో కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. దొంగ ఓట్లు వేస్తున్నవారిని పట్టుకుంటే టీడీపీ కార్యకర్తలనే అరెస్ట్ చేస్తున్నారన్న చంద్రబాబు.. ఎన్నికల కమిషన్ ఉందా.. చేతకాక పోతే వెళ్లిపోండి అంటూ ఘాటు స్పందించారు.

వైసీపీ నేతలను ఎలా అనుమతిస్తారు
ఎన్నికల సమయంలో పోలీసులు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నవారిని పట్టుకుంటే టీడీపీ కార్యకర్తలనే అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ అరాచకపాలన, పెరిగిన ధరలు, పెంచిన పన్నులు, అధ్వాన రోడ్లు ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోందని ధ్వజమెత్తారు. పెనుగొండలో అక్కడి వైసీపీ ఎంపీ ఎలా పోలింగ్ కేంద్రంలోకి వెళ్తారని ప్రశ్నించారు. గుంటూరులో మేయర్ ను ఎలా అనుమతించారని నిలదీసారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని చంద్రబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications