ఒక్క క్లిక్ తో ఇంటికే రైతుబజార్ కూరగాయలు, అక్కడి ధరలకే అన్ని ఉత్పత్తులు..!!
ఇప్పటికే ఈ కామర్స్ ప్లాట్ ఫారాల ద్వారా కూరగాయలు ఇంటికి వస్తున్నాయి. కాగా, కొత్తగా రైతు బజార్ల నుంచి ఇంటికి కూరగాయలు డోర్ డెలివరీ చేయనున్నారు. రైతుబజార్ల ధరలకే డోర్ డెలివరీ చేసేలా కొత్త సదుపాయం కల్పించారు. దీంతో.. ఒక్క క్లిక్ దూరంగా రైతుబజార్ వినియోగ దారులకు అందుబాటులోకి వచ్చింది. తొలిగా ఈ విధానం పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు.
రైతు బజార్ నుంచి కూరగాయలు అక్కడి ధరలకే డోర్ డెలివరీ చేయనున్నారు. అందులో భాగంగా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు కూడా లాభం చేకూర్చ డానికి ప్రభుత్వ సహకారంతో 'మాచింట్ సొల్యూషన్స్' అనే సంస్థ ముందుకొచ్చింది. రైతు బజార్లను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చింది. బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు ఎలాగైతే ఆన్‌లైన్‌లో కూరగాయలు, పండ్లను ఆర్డర్ తీసుకొని డోర్ డెలివరీ చేస్తున్నాయో అదే విధానంలో రైతుబజార్ల నుంచి తాజా కూరగాయాలు, పండ్లు, ఇతర నిత్యవసరాలు సరఫరా చేయడానికి మాచింట్ సొల్యూషన్స్ https://digirythubazaarap.com/ అనే వెబ్‌సైట్ రూపొందించింది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఆరోజు రైతుబజార్లలో అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ధరలు కనిపిస్తాయి.

కావాల్సినవి ..నచ్చినవి ఆర్డర్ చేసుకున్న తర్వాత.. నిమిషాల వ్యవధిలోనే వాటిని మాచింట్ సొల్యూషన్స్ సంస్థ డోర్ డెలివరీ చేస్తుంది. వీటికి ఆన్‌లైన్‌లోనే డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతుబజారులో దీనిని పైలట్ ప్రాజెక్టు కింద వారం రోజుల క్రితం ప్రారంభించారు. రైతుబజారుకు 4 నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న వారి నుంచి ఆర్డర్లు తీసుకొని, డెలివరీ చార్జీలు ఏమీ తీసుకోకుండానే రైతుబజార్ ధరలకే సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈ సంస్థతో ఎంవోయూ చేసుకుని మిగిలిన బజార్లకు కూడా ఈ సేవలు విస్తరించాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు యోచిస్తున్నారు. డిజి రైతు బజార్ యాప్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే అది కూడా అందుబాటులోకి రానుంది. విశాఖలో నిర్వహణలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలుకు కసరత్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications