టి ఎఫెక్ట్: కేశవ్‌తో శైలజనాథ్, జగన్నాటకమని గోరంట్ల
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌తో మంత్రి శైలజానాథ్ శనివారం సమావేశమయ్యారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని సీమాంధ్ర టిడిపి నేతలను ఈ సందర్భంగా మంత్రి కోరారు. దీనిపై పార్టీ పెద్దలతో చర్చించి చెబుతామని పయ్యావులు తెలిపారు.
అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం సమావేశంలో నిర్ణయం ప్రకారం అన్ని పార్టీల సీమాంధ్ర నేతలతో మాట్లాడుతున్నామని, త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలను కూడా కలసి అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాలని కోరుతామని శైలజానాథ్ తెలిపారు.

కాగా, అంతకుముందు పయ్యావుల మాట్లాడుతూ.. సమైక్యత కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాలని అన్నారు. బిల్లు వల్ల ఇరుప్రాంతాల మధ్య ఘర్షణ జరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన బిల్లు అధ్యయనం చేస్తే తెలంగాణ నేతలు కూడా బిల్లును అంగీకరించరని పయ్యావుల తెలిపారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని వస్తే ఊరేగిస్తామని పయ్యావుల వ్యాఖ్యానించారు.
అనుకూల సర్వేలు: గోరంట్ల
రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలన్నీ జగన్నాటకమే అని, సర్వే కంపెనీలనూ మేనేజ్ చేస్తున్నారని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. దోచిన డబ్బుతో అనుకూలంగా సర్వేలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపిని దెబ్బతీయడానికి మరో పార్టీతో కుమ్మక్కయ్యారని... పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని గోరంట్ల విమర్శించారు.












Click it and Unblock the Notifications