చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ కళ్యాణ్ ఎజెండా: సజ్జల కౌంటర్; మంత్రి కాకాణి చురకలు!!
పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ ఇమేజ్ నీటి బుడగ లాంటిది అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ కళ్యాణ్ పనిగా పెట్టుకున్నారని పవన్ అజెండా అదేనని ప్రజలు రామకృష్ణ రెడ్డి విమర్శించారు.
పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలతో తనకు బలం లేదని ఒప్పుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఫ్యాన్స్ కన్న కలలను చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మరోవైపు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూరిస్టులని, కొన్ని రోజులు కనబడి, మళ్లీ డెన్ లోకి వెళ్లడం అలవాటేనంటూ సెటైర్లు వేశారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రైతులపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తిరుగుతూ పవన్ హడావుడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో రైతుల కోసం ఏం చేశారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పలేకపోతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల కోసం ఎంతో చేస్తుందని, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులను ఆదుకోవడానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగన్ ఆదేశించారని ఆయన గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చే పార్టీలతో అవసరమైనప్పుడు కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని ఆయన వెల్లడించారు. తాను సీఎం అభ్యర్థిని అయితేనే పొత్తులు పెట్టుకోవాలని కోరుకునేవాళ్లు గత ఎన్నికల్లో కనీసం 40 స్థానాలలో జనసేనను గెలిపించి ఉండాల్సిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీఎం పదవి తనను వరించాలి తప్ప వెంపర్లాడేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications