అమరావతిలో రూ.10,000 కోట్ల సంపద సృష్టి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అంశం- రాజధాని అమరావతి పరిధిలోని ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ. దీనికి ముహూర్తాన్ని కూడా పెట్టింది. లబ్దిదారులకు ఈ నెల 24వ తేదీన పట్టాలను పంపిణీ చేయనుంది. వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వెంకటాయపాలెంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
అమరావతి ప్రాంతంలో కొత్తగా ఆర్ 5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ముఖ్య ఉద్దేశం- పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడమే. అందరికీ ఇళ్లు పథకం కింద అమరావతిలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గతంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాల కోసం నోటిఫై చేసింది. దీనికోసం అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌లో కూడా మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. గుంటూరు, విజయవాడకు చెందిన 28 వేల మందికి ప్రస్తుతం ఆర్-5 జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది.
ఇళ్ల నిర్మాణ పనులను ఇవ్వాళ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షించారు. నిర్మాణ పనులను వారు దగ్గరుండి పరిశీలించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం విమర్శలు గుప్పించారు.
అమరావతిలో పేదల సొంతింటి కల నిజమవుతోందని సజ్జల పేర్కొన్నారు. ఆర్ 5 జోన్‌లో ఆరునెలల్లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలతో పేదలు కోటీశ్వరులు కావడం ఖాయమని, వారిని చూసి చంద్రబాబు కుళ్లి కుళ్లి ఏడవటం ఖాయమని వ్యాఖ్యానించారు.
పేదలకు ఇళ్లు రాకూడదన్నదే టీడీపీ ప్రయత్నమని, వారికి గూడు కల్పించడానికి తాము పోరాటం సాగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తోంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. అమరావతిలో పేదలు నివాసించకూడదనేది తెలుగుదేశం ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
అమరావతి ప్రజా రాజధాని పేరుతో చంద్రబాబు భ్రమల్లో ముంచాడని, ఇక్కడ భూములు కొన్నది రైతుల ముసుగులో టీడీపీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని సజ్జల ఆరోపించారు. పేదలకు అమరావతిలో ఇళ్లు కల్పించడానికి తాము ప్రయత్నాలు చేస్తోంటే టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేయించి అడ్డుపడ్డారని విమర్శించారు.
అమరావతిలో ధనికులు, సంపన్న వర్గాలే ఉండాలనేది చంద్రబాబు ప్రయత్నమని, అందుకే ఇక్కడి నుంచి రైతులు, కూలీలను తన ప్రభుత్వ హయాంలో తరిమేశాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు పూర్తి భిన్నంగా జగన్ పేదల పక్షపాతిగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేదలకు ఇచ్చిన మాట కోసం కృషి చేశారని అన్నారు.
అమరావతి ఆర్ 5 జోన్‌లో అన్ని సౌకర్యాలతో పేదలకు ఇళ్లను నిర్మిస్తోన్నామని చెప్పారు. అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణంతో 10,000 కోట్ల సంపద ఏర్పడుతుందని, వారంతా కోటీశ్వరులు అవుతారని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలు చూశాక చంద్రబాబు కుళ్లుకోవడం ఖాయమని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications