పేదలు పాకిస్తాన్ వాళ్లా-ఆర్ 5 జోన్ లోకి వెళ్లకూడదా ? విపక్షాలకు సజ్జల సూటి ప్రశ్న
ఏపీ రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్ పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పేదల ఇళ్ల స్ధలాల కేటాయింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులో సీఎం జగన్ ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని పేదలకు ఇక్కడ ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ఆర్ 5 జోన్ లో పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి ఆర్ 5 జోన్ లో మోడరన్ టౌన్ లు రాబోతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.వీటిలో పేదల ఇళ్ళు రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ళు పూర్తయ్యాయని, మహా యజ్ఞంలా పనులు సాగుతున్నాయని సజ్జల పేర్కొన్నారు. సైందవుల్లా పేదలకు స్థానం లేకుండా మాష్టర్ ప్లాన్ వేశారని వివక్షాలను ఉద్దేశించి సజ్జల విమర్శలు చేశారు. అన్ని వర్గాలు లేని నగరం ఎక్కడా ఉండదన్నారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇద్దామంటే అన్ని రకాల అడ్డంకులు సృష్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.రాజధాని రైతుల ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టులకు వెళ్ళారన్నారు. ప్రభుత్వం అయినా తర్వాత మాష్టర్ ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చున్నారు. పేదలు, దళితులతో కల్తీ కాకూడదని వాళ్ళు మాత్రమే ఉండాలని అనుకుంటున్నారన్నారు.
ఓట్లు అడగాల్సిన పేదలను కూడా తిడుతున్నారంటూ విపక్షాలను విమర్శించారు.
ఆర్ 5 జోన్ లో ప్రైవేటు లే అవుట్స్ కన్నా మంచిగా లేఅవుట్స్ వేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్5 జోన్ లోకి వచ్చే పేదలు పాకిస్థాన్ వాళ్ళా అని ప్రశ్నించారు. దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ పేదల గురించే మాట్లాడుతున్నారన్నారు. పేదలకు ఇవ్వాలని చట్టం ఉన్నా ధనవంతులకు మాత్రమే అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇంతకు మించి గతంలో ఎవరూ ఇళ్ళు ఇవ్వలేదన్నారు. బ్యాంక్ లోన్లు ఇస్తారు. అదేవిధంగా ఇసుక, స్టీల్, సిమెంట్ ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారని సజ్జల తెలిపారు.












Click it and Unblock the Notifications