టీడీపీకి తోకపార్టీలా బీజేపీ: సోము వీర్రాజు, చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
అమరావతి: ఏపీ బీజేపీ, తెలుగుదేశం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతలు చేసిన కామెంట్లపై మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అజెండానే బీజేపీ నేతల అజెండా అని విమర్శించారు.

ఇంత దిగజారుడా?: టీడీపీ, బీజేపీలపై సజ్జల ఫైర్
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఆయనవేనని.. స్క్రిప్ట్ మాత్రం టీడీపీ ఆఫీసులో తయారవుతోందని సజ్జల ఆరోపించారు. అమరావతిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మాట్లాడారు. టీడీపీ, బీజేపీలకు సొంత అజెండా ఉండటం లేదన్నారు. ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తోలుబొమ్మలాట అంటూ సజ్జల
రాజధాని అమరావతి స్కాములమయం అని గతంలో బీజేపీ నేతలు అన్నారని, ఇప్పుడేమో ఆ పార్టీ నేతలే అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారని సజ్జల మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఉండాలంటారు.. విశాఖ వద్దు ఆ రెండు ప్రాంతాలే కావాలని చెప్పొచ్చు కదా అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని బీజేపీ వాళ్ళే అంటారు.. ఈ విషయంలో వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని వాళ్లే ప్రశ్నిస్తారని విమర్శించారు. ఆయా పార్టీలతో చంద్రబాబు విజయవంతంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

టీడీపీకి తోక పార్టీలా బీజేపీ: సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీ బీజేపీ.. టీడీపీకి తోక పార్టీగా మారిందని సజ్జల ఎద్దేవా చేశారు. ఎక్కడైనా జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి. ఏపీలో మాత్రం రివర్స్ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ పని చేస్తోంది. ఏపీ బీజేపీని చూస్తుంటే జాలితో పాటు బాధ కలుగుతోందన్నారు సజ్జల. మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు.
అందుకే ఇప్పటి నుంచే పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తన పార్టీ ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీ ఎందుకు ప్రశ్నించదు అని సజ్జల ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు మాయల ఫకీరులా..: సజ్జల
రాష్ట్రంలో బీజేపీ లేదు.. అందుకే ప్రజల భావోద్వేగాలు ఏంటో వాళ్ళకు తెలియదు. రాష్ట్రంలో బీజేపీ శక్తి ఏంటో వాళ్ళకూ తెలుసన్నారు సజ్జల. రాజకీయాల్లో చంద్రబాబు ఒక మాయా ఫకీరు. చంద్రబాబు గంట కొట్టగానే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడులా వచ్చి వెళుతుంటారు. చంద్రబాబు ఏజెంట్లుగా సుజనా చౌదరి, సీఎం రమేష్... టీటీడీ ఎజెండాను విజయవంతంగా నడుపుతున్నారు.
వీళ్ళిద్దరినీ చూపిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నామని చంద్రబాబు తన నాయకులకు చెబుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బీజేపీపై మండిపడ్డారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఏపీలో ఆ పార్టీ లేదన్నారు. ఏపీలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతూ బీజేపీ ఈ రోజు సభ నిర్వహిస్తోందన్నారు. ఉనికి కాపాడుకోవడానికి పెట్టే సభ తప్ప ఏమీ ఉపయోగం లేదన్నారు.












Click it and Unblock the Notifications