అప్పుడు సీబీఐని రానివ్వనని-ఇప్పుడు రమ్మని లేఖలా ? చంద్రబాబుపై సజ్జల ఫైర్..
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వైసీపీ పాలనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విపక్ష నేత చంద్రబాబు కేంద్రానికి వరుసగా రాస్తున్న లేఖలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తీవ్రంగా స్పందించారు. కొన్ని రోజులుగా ప్రజల తరపున మాట్లాడుతున్నామన్న పేరుతో ప్రతిపక్షం అనబడే, అరాచకశక్తుల మూక చంద్రబాబు నాయకత్వంతో పని చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఒక పద్ధతి, స్కీమ్ ప్రకారం తండ్రీ,కొడుకు,దత్తపుత్రుడు ముగ్గురూ వేర్వేరుగా పర్యటనలు చేస్తూ , వీరికి మద్దతుగా పార్టీల నాయకులు, దివాళా తీసిన, చెల్లని నాణాల్లాంటి కొన్ని పార్టీల నాయకులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారన్నారు.
ఎన్నికలు ఏడెనిమిది నెలల్లోకి వస్తాయని, అధికారంలో ఉన్న తాము ఇప్పటి వరకు చేసింది చెప్పి, మళ్లీ ఓట్లు అడుగుతామని సజ్జల తెలిపారు. ప్రతిపక్షంగా ఉన్న పార్టీ తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పుకుని, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేస్తామని చెప్పుకోవాలని సూచించారు. ఏదైతే నిజం కానివన్నీ, ఏదైతే ప్రజలకు సంబంధించింది కాదో, లేదా ఎన్నికలకు సంబంధించిన ఎజెండా కాదో.. వాటినే మాట్లాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు సంబంధించి సీరియస్ ఎజెండా ఉండాలి. తాము చెప్పినవాటిలో ఏం చేశామో చెప్పాలన్నారు.

కానీ అవేవీ లేకుండా క్యారెక్టర్ అస్సాసినేషన్, రెచ్చగొట్టే ప్రసంగాలు, పచ్చి అబద్దాలతో కూడిన బూతులు మాట్లాడడం.. ముందుకు తోసుకు రావడం, ఎక్కడైనా పోలీసులు ఆపితే చొక్కాలు చింపి గొడవ చేయడం. ఇదే వారి పనిగా మారిందని సజ్జల ఆక్షేపించారు. మాకు ఏ చట్టంతో సంబంధం లేదు. మేము ఏదైనా చేయొచ్చు. మమ్మల్ని ప్రశ్నిస్తే ఇల్లు ఎక్కి అరుస్తాం అన్నట్లు చేస్తున్నారన్నారు. ఇంకా ఢిల్లీకి పోవడం, అవసరం అనుకుంటే యూఎన్‌ఓకూ వెళ్తాం అన్నట్లు చేస్తున్నారన్నారు.
రుషికొండపై పవన్ కు ఎందుకంత ఆవేశం? దేనికి ఆ పూనకం? ఎందుకంత ఊగిపోవడం? అని సజ్జల ప్రశ్నించారు. అక్కడ అంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదన్నారు. అంత సందర్భం కూడా లేదన్నారు. ఆవేశంగా ఒక డైలాగ్ చెప్పడం. దానికి ముందున్న ప్రజల నుంచి కేకలు రాగానే ఊగిపోవడం పరిపాటి అవుతోందన్నారు. సినిమాల్లో డైలాగ్‌లకు ప్రేక్షకులు ఈలలు వేసి, గోల చేసినట్లుగా ఇక్కడ సభల్లో అభిమానుల నుంచి అదే స్పందన రాగానే రెచ్చిపోవడం పవన్‌కళ్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు. అభిమానులు కొడుతున్న చప్పట్లు, చేస్తున్న కేరింతలకు రాబోయే ఎన్నికలకు ఏ సంబంధం ఉండదన్నారు.
ఇక పవన్‌కళ్యాణ్ యజమాని చంద్రబాబు వేషాలు మరీ అన్యాయమని సజ్జల విమర్శించారు. అంగల్లు, పుంగనూరులో ఏం జరిగిందో అందరం చూశామని, అంతకు ముందు కందుకూరులో ఏం జరిగిందో తెలుసని పేర్కొన్నారు. బాబు పబ్లిసిటీ పిచ్చి కోసం 8 మంది చనిపోయారు. దీంతో రోడ్ల మీద సభలపై ఆంక్షలు పెడితే గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇక అంగల్లు వద్ద పోలీసులపై దాడి చేశారని, చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఒక పోలీస్ కళ్లు పోయాయన్నారు. పోలీసులు సంయమనం పాటించకుండా కాల్పులు జరపాలని, తమ వాళ్లు కొందరు చనిపోయాలని, దాంతో ప్రభుత్వంపై యుద్ధం చేయాలని చంద్రబాబు కుట్ర అని సజ్జల తెలిపారు.
In the interest of democracy, as the Leader of Opposition, I wrote to Hon’ble President of India Smt. Droupadi Murmu Ji and Hon’ble Prime Minister of India Sri Narendra Modi Ji about the anti-democratic and unconstitutional acts unleashed on the Citizens of Andhra Pradesh with… pic.twitter.com/TElctnDSkP
— N Chandrababu Naidu (@ncbn) August 13, 2023
అది జరగక పోవడంతో తనపై హత్యాయత్నం జరిగిందని, ఇక్కడ దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారని సజ్జల విమర్శించారు. 10 పేజీల్లో ఆయన గురువులు, ఆ పార్టీ మార్గదర్శకులు, ఆ పత్రికల్లో రాసిన ఐటెమ్స్ అన్నీ క్రోడీకరిస్తూ తనపై హత్యాయత్నం జరిగిందని, కాబట్టి సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ లేఖ రాశారన్నారు. గతంలో అదే సీబీఐ రాష్ట్రంలోకి రానివ్వబోమన్న చంద్రబాబు, ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కోరుతున్నాడన్నారు.ఆయన అనుకూల మీడియాలో అదే పనిగా రాయడం. వాటిని ట్వీట్ చేయడం. ఆయన ఆర్కెస్ట్రాతో మాట్లాడించడం.. అలా ప్రచారం చేసి సీబీఐ దర్యాప్తు కావాలని కోరడం.. కేంద్రానికి లేఖ రాయడం. బాబుకు అలవాటుగా మారిందన్నారు.
చంద్రబాబుకు 'మెగలో మానియాక్' అని జబ్బు వచ్చిందని, అధికారం తన హక్కు. తన సొంతం అనుకోవడంతో పాటు, తనకు మించిన అర్హులు లేరని భావించడం, దాంతో అహంకారం పెంచుకోవడం, ఆ అధికారం పోతే ఒక ఉన్మాదిలా మారడం అని సజ్జల విమర్శించారు. 'మెగలో మానియాక్', 'ఫిజియో ఫ్రీనియా'.. ఈ వ్యాధులు ఉండే వారు ఎలా వ్యవహరిస్తారో.. ఆ లక్షణాలు చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రపతికి వేరే పనులు లేవా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications