తప్పుడు కేసులు రీఓపెన్..! అధికారులపైనా విచారణ-సజ్జల హెచ్చరికలు..!
ఏపీలో వైసీపీ నేతల్ని టార్గెట్ చేసేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మండిపడ్డారు. టీడీపీ నేతలతో పాటు కూటమి ప్రభుత్వం చెప్పినట్లు తలూపుతున్న అధికారులకూ సజ్జల తీవ్ర హెచ్చరికలు చేశారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీ నేతలపై నమోదు చేస్తున్న తప్పుడు కేసుల్ని కచ్చితంగా రీఓపెన్ చేస్తామని, అలాగే అధికారులపైనా విచారణలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
గుడివాడలో వైసీపీ సమావేశానికి వెళ్తున్న జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ నాయకులు దారి కాసి దౌర్జన్యం చేశారని, ఆమె కారును పోలీసులు తాళ్లతో కట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే గంటన్నర సేపు ఉప్పాల హారికపై గూండాలు దాడులు చేశారన్నారు. కాపాడాల్సిన పోలీసులే వారికి రక్షణ కల్పించారన్నారు. దాడి చేసి ఉప్పార హారిక భర్త రాముపై ఎదురు కేసు పెట్టారన్నారు. పోలీసులు ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని సజ్జల ప్రశ్నించారు.

పోలీసులు ఇవాళ తప్పించుకోవచ్చని, కానీ అంతా చట్టం ముందు ఓ రోజు నిలబడాల్సి వస్తుందని సజ్జల హెచ్చరించారు. పోలీసులు ఎలాగైనా కేసులు పెడతామని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు మెకానికల్ గా రిమాండ్ లకు పంపొద్దంటూ అన్ని కోర్టులకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని సజ్జల గుర్తుచేసారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తూ ఎదురుకేసులు పెడుతున్నారని సజ్జల విమర్శించారు.

నెల్లూరులో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని, కేతిరెడ్డి పెద్దారెడ్డిని హైకోర్టు చెప్పినా తాడిపత్రిలోకి రానివ్వడం లేదని, జగన్ బంగారుపాళ్యం, పొదిలి, ఇతర చోట్లకు పర్యటనకు వెళ్తే తప్పుడు కేసులు పెట్టారని, వీటిని తాము అధికారంలోకి రాగానే రీఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అప్పుడు అధికారులపైనా విచారణలు తప్పవన్నారు. తమ ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దని సజ్జల వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications