గన్నవరం ఘటనపై సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
గన్నవరం వ్యవహారం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్రంలో సంచలనంగా మారిన గన్నవరం వ్యవహారం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గన్నవరం ఘటన జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఘటనను తాము సమర్ధించటం లేదన్నారు. కానీ, అసలు ఘటనకు కారకులెవరు..రెచ్చగొట్టింది ఎవరో ఆలోచన చేయాలని సూచించారు. అక్కడకు వంశీ వెళ్లకపోవటమే సంయమనం పాటించటమని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించామని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రచారం కోసం టీడీపీ తాపత్రయ పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రెండు రోజుల క్రితం గన్నవరం లో చోటు చేసుకున్న ఘటనలు.. జరుగుతున్న ప్రచారం పైన సజ్జల స్పందించారు. నాలుగు రోజులుగా మాటలు జరుగుతూనే ఉన్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ ను గన్నవరం లో పోటీ చేయమని వంశీ వ్యాఖ్యానిస్తే టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారన్నారు. విజయవాడలో ఉండే పట్టాభి గన్నవరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ హయాంలో ఉన్నట్లు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని సజ్జల పేర్కొన్నారు. వాళ్ళే అరాచకాలు సృష్టించి మా పార్టీని బాధ్యులను చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం ద్వారా పట్టాభిని చంద్రబాబు అన్ని రకాలుగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. టీడీపీలో ఏ ఒక్కరూ పట్టాభికి మద్దతుగా లేరన్నారు.

పట్టాభి గతంలో తనకు తగిలిన దెబ్బలు చూపిస్తే ఆ ఫొటోలను ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చి ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు..ఆయన మద్దతు మీడియా సంస్థలు ప్రతీ రోజు ప్రజలను నమ్మించేందుకు ఎన్నో రకలుగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలను బూతులు తిట్టటమే పనిగా అయ్యన్న లాంటి టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు .చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ శిక్షణా తరగతుల్లో చెంగల్రాయుడు తప్పులు చేసి ఎలా తప్పించుకోవాలో వివరించారని వీడియో ప్రదర్శించారు. బూతుల్లో పోటీ పడితే టీడీపీ నేతలకు డిస్టింక్షన్ వస్తుందని ఎద్దేవా చేసారు. టీడీపీ మద్దతు మీడియా రాసే వార్తలు ఆర్డీఎక్స్ కంటే ప్రమాదకరమని సజ్జల వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వ హననం చేయటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications