ఎన్టీఆర్‌తో బాబు ఎక్కడో? అప్పుడు రూటు మార్చారు: దులిపేసిన సాక్షి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా విరుచుకుపడింది. రెండు రోజుల క్రితం మండలిలో ఆయన చేసిన ప్రసంగాన్ని దులిపేసింది.

ఎన్టీఆర్ గురించి చేసిన ప్రసంగం
చంద్రబాబు 35 ఏళ్ల తర్వాత తన రాజకీయ జీవిత విశేషాలను నెమరువేసుకుంటూ చెప్పిన పలు విషయాలు అందర్నీ నివ్వెరపరుస్తున్నాయని ఆ మీడియా పేర్కొంది. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారని రాసింది.

ఎన్టీఆర్ పైన పోటీ మీద చంద్రబాబు
అసలు పార్టీ పెట్టమని ఎన్టీఆర్‌కు చెప్పింది తానే అని, ఎన్నికల్లో ఎన్టీఆర్ పైన పోటీ చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని చంద్రబాబు అన్న విషయాల పైన సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారని, చరిత్రను తిరగదోడుతున్నారని పేర్కొంది. ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది తానే అని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

టిడిపి పెట్టడంలో చంద్రబాబు పాత్ర లేదు
1982లో పార్టీ స్థాపించాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్న రోజుల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు కానీ, కసరత్తు చేసినప్పుడు కానీ చంద్రబాబు పాత్ర ఎక్కడా లేదని, పైగా సినిమా గ్లామర్‌కు ఓట్లు రాలుతాయా అని ఎద్దేవా చేశారని, అలాంటి చంద్రబాబు తన పెళ్లి రోజున స్మరించుకుంటూ చెప్పిన వివరాలు అందర్నీ విస్మయపరుస్తున్నాయని పేర్కొంది.

చంద్రబాబు నుంచి అప్పుడు మాట రాలేదు
ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టమని చెప్పింది తానే ఆయన బతికి ఉన్నప్పుడు చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని, ఆయన చనిపోయిన ఇరవై ఏళ్ల తర్వాత ఈ విషయాలను చెప్పడాన్ని పోలుస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారని రాసింది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం
1982 మార్చి 21న రామకృష్ణా స్టూడియోస్‌లో విలేకరుల సమవేశం పెట్టిన ఎన్టీఆర్ తాను ప్రజా జీవితంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు ఆయన పక్కన చంద్రబాబు లేరని, సరికాదా పార్టీలో చేరాలని ఆహ్వానించినా చంద్రబాబు తిరస్కరించారని, అదో గాలి పార్టీ అని ఎద్దేవా చేశారని, ఎన్టీఆర్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల భాస్కర రావు, ఇతర ఎమ్మెల్యేలు ఆదయ్య, రత్తయ్య, నారాయణ తదితరులు రాజీనామా చేసి, టిడిపికి మద్దతు ఇచ్చారని, ఆ సమయంలోను చంద్రబాబు పక్కన లేరని, ఆ తర్వాత కొద్ది రోజులకు ఊటిలో సినిమా షూటింగ్ ముగించుకొని 1982 మార్చి 29న హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ నేరుగా నాదెండ్ల ఇంటికి వెళ్లారని, అప్పుడు కూడా చంద్రబాబు పక్కన లేరని, ఆ తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో ఎన్టీఆర్ తన పార్టీ పేరును ఖరారు చేశారని, అప్పుడు కూడా చంద్రబాబు పక్కన లేరని పేర్కొంది.

తెలుగుదేశం పార్టీలో బాబు అప్పుడు ఎక్కడ
రామకృష్ణా స్టూడియోస్‌లో టిడిపి లోగోను ఎన్టీఆర్ ఒక కాగితం పైన గీశారని, చక్రం, నాగలి, గుడిసె చిత్రాలతో పసుపు జెండా రూపొందించారని, ఆ తర్వాత అక్కడే ఉన్న ప్రముఖులను అభిప్రాయాలు అడిగారని, ఆ సమయంలో కూడా చంద్రబాబు అక్కడ లేరని, ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారని, 1982 ఏప్రిల్ 11న నిజాం కళాశాల మైదానంలో టిడిపి తొలి బహిరంగ సభ జరిగిందని, అప్పుడూ బాబు లేరని రాసింది.

దగ్గుబాటి పుస్తకం నుంచి తీసుకొని..
నిజాం కాలేజీలో తొలి సభ ముగిసిన తర్వాత పలువురు నాయకుల మద్దతు కోరడంలో భాగంగా తాను చంద్రబాబు వద్దకు వెళ్లానని దగ్గుబాటి తన పుస్తకంలో రాశారని సాక్షి మీడియా పేర్కొంది. ఆ సమయంలో చంద్రబాబు ఓ కాగితం తీసి లెక్కలు వేసి, ఎన్టీఆర్ జేబులో నుంచి పైసా తీయడని, ఎన్టీఆర్‌కు 5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని, ఎట్టి పరిస్థితుల్లో గెలవడని, తనకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఉందని, తాను పదవిని వదులుకొని ఎలా వస్తానని చంద్రబాబు తనతో చెప్పారని దగ్గుబాటి రాసినట్లు పేర్కొంది.

మామ పైన పోటీ చేస్తానన్న చంద్రబాబు
1982 నవంబర్ 18న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ఎన్టీఆర్ మీద పోటీకి సిద్ధమని చంద్రబాబు ప్రకటన చేశారని, 1982లో తిరుపతిలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలోను మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశిస్తే మామ పైన పోటీకి సిద్ధమని ప్రకటించారని రాసింది. టిడిపి గాలి పార్టీ అని కూడా చంద్రబాబు అన్నట్లుగా ఉందని రాసింది.

చంద్రబాబు అప్పుడే రూటు మార్చారు
ఎన్టీఆర్ పైన పోటీ చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని మండలిలో చంద్రబాబు రెండు రోజుల క్రితం చెప్పారని, కానీ అది అవాస్తవమంటూ అందుకు సంబంధించిన కొన్ని నాటి పత్రిక ప్రకటనలను సాక్షి మీడియా చూపించింది. ఇదిలా ఉండగా, 1983 జనవరి 5న చంద్రగిరిలో మేడసాని వెంకటరామ నాయుడు చేతిలో 17వేల ఓట్ల పై చిలుకు ఓట్లతో చంద్రబాబు ఓడిపోయాక రూటు మార్చారని పేర్కొంది. ఎన్నికల్లో ఓడిన పదిహేను రోజులకే మామ ఎన్టీఆర్ వద్దకు పలువురి ద్వారా రాయబారం పంపించారని, తన విధానాలు మార్చుకుంటానని, అంకితభావంతో పని చేస్తానని, టిడిపిలో చేరుతానని పంపించారని పేర్కొంది. అంతకుముందు చంద్రబాబు 1983లో చిత్తూరు జిల్లాలో టిడిపి ఓటమికి కృషి చేశారని, జిల్లాలో టిడిపి కార్యాలయాన్ని ధ్వంసం చేయించారని కూడా పేర్కొంది.

1989లో ఎందుకు ఓడారు
ఓ వ్యక్తి బొమ్మ (ఎన్టీఆర్) పెట్టుకొని తాము గెలవలేదని, టిడిపి గెలుపులో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని, ఎన్టీఆర్‌కు చరిష్మా ఉంటే 1989లో ఎందుకు ఓడిపోయారని చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అడిగారని సాక్షి పేర్కొంది. ఓ సమయంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పైన కూడా చంద్రబాబు మాట్లాడిన అంశాలను కూడా పేర్కొంది.

లోకేష్ వద్దన్నారని
తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని, అప్పుడు పదో తరగతి చదువుతున్న లోకేష్.. సీఎం పదవి శాశ్వతం, ప్రధాని పదవి అశాశ్వతం అని చెప్పాడని అందుకే తాను సీఎం పదవి ఎంచుకున్నానని చంద్రబాబు చెప్పారు. దీనినే ప్రశ్నిస్తూ.. ఎన్టీఆర్ విషయంలో ఓ విధంగా మాట్లాడిన చంద్రబాబు, కొడుకు చెబితే మాత్రం ముఖ్యమంత్రి పదవి శాశవతం ఎందుకు భావించారో తెలియాలని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications