
ఏపీలో రంకెలేస్తున్న సంక్రాంతి కోళ్లు-కృష్ణా, గోదావరి జిల్లాల్లో జోరుగా పందాలు
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా వరుసగా ఇబ్బందులు తప్పలేదు. దీంతో ఈసారి కొంత హడావిడి కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల హంగామా కనిపిస్తోంది. అందులోనూ కోడి పందాల సందడి అంతా ఇంతా కాదు. పల్లెల్లో కోడి పందాల జోరు కనిపిస్తోంది.
కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ దాదాపు ప్రతీ పల్లెలోనూ కోడి పందాలు సాగుతున్నాయి. వీటిని స్ధానిక ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజకవర్గం లో కోడి పందాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. కోడి పందాలను ఎమ్మెల్సీ అరుణ్ కుమార్.లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పందేలు సాగనున్నాయి. వీటిలో లక్షల రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. అళాగే కోళ్లకు కత్తులు కట్టి మరీ ఈ పందేలు నిర్వహిస్తున్నారు.

అలాగే కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో ప్రతి యేటా మాదిరిగా ఈసారి కూడా కోడి పందాల నిర్వహణ కోసం భారీ సెట్టింగులు , ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల నుంచి వరుణుడి ప్రభావంతో కురిసిన వర్షాలతో నేల చిత్తడిగా తయారైంది. దీంతో నేల చదును చేసి మధ్యాహ్నం. నుంతి సంక్రాంతి సంబరాలు ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
అకాశం మోఘవృతమై చినుకులు పడుతున్నప్పటికి జనం సంక్రాంతి సంబరాలు వీక్షించేందుకు తరలివస్తున్నారు. సామాన్యుల నుంచి ఉన్నతి శ్రేణి ప్రజలు కూర్చుని చూసేందుకు ప్రత్యేక గ్యాలరీ, ఎల్ ఈ డీ తెరలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర ,తెలంగాణ ,కర్ఢాటక , ఒరిస్సా రాష్ట్రాల నుంచే ఇతర దేశాల్లో స్ధిరపడిన నుంచి ప్రవాసాంధ్రులు తరలిరానున్నారు.
గోదావరి జిల్లాల్లోనూ దాదాపు ప్రతీ పల్లెలూ పందాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. నిన్న మొన్నటివరకూ పందాలు నిర్వహించరాదని ఆంక్షలు పెట్టిన పోలీసులు.. పండగ వచ్చేసరికి మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో పందేలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వీటిలో భారీగా డబ్బు చేతులు మారుతోంది. సంక్రాంతి అంటేనే కోడి పందాలు కాబట్టి పందాలు నిర్వహిస్తున్నామని పందెం రాయుళ్లు చెప్తున్నారు.