విశాఖ నుండి పోటీకోసం, బిజెపి నేతల ఫోన్: శరత్‌బాబు
హైదరాబాద్/శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయించేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సినీ, క్రికెట్ ప్రముఖుల వైపు చూస్తోంది. ప్రీతి జింటా, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే తదితరుల పేర్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మన రాష్ట్రంలోని సినీ ప్రముఖుల కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు శరత్ బాబు పేరు వినిపిస్తోంది. ఇప్పటికే కృష్ణం రాజు పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే.
శరత్ బాబు బుధవారం విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్తూ పూసపాటిరేగ ప్రాంతంలో కాసేపు ఆగారు. ఈ సమయంలో ప్రజలు, అభిమానులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ ప డ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

బిజెపి తరపున విశాఖపట్నం పార్లమెంట్ లోకసభ స్థానానికి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తనకు ఫోన్లు చేసి అడుగుతున్నారని శరత్ బాబు స్వయంగా వెల్లడించారు. అందుకే ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతూ మార్గమధ్యంలో ఆగినట్లు చెప్పారు. అక్కడ కొద్దిసేపు ఆగి ప్రజలకు అభివాదం చేసిన ఆయన పలువురు అభిమానులతో మాట్లాడి వెళ్లారు.
కాగా, రాష్ట్రం నుండి బిజెపిలో పలువురు ప్రముఖులు ఉన్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణం రాజు... వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఇప్పుడు లోకసభకు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కోట శ్రీనివాస రావు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications