కౌన్సెలింగ్: దేవినేని హెచ్చరిక, కేసీఆర్‌కు చెంప పెట్టా?
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం విజయవాడలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఆయన కూతురు కవిత ఎంపీగా, కొడుకు కేటీఆర్ మంత్రిగా, అల్లుడు హరీష్ రావు మంత్రిగా అయ్యారని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు.
విద్యార్థుల జీవితాలతో ఆటలడుకోవద్దని హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. కౌన్సిలింగ్‌కు ఆటంకాలు కల్పించడమంటే లక్షలాదిమంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల భవిష్యత్‌తో ఆటలు ఆడుకోవడమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రజలలో విద్వేషాలు రగిల్చేదానిలో పదోవంతు ధ్యాస, సమస్యల పరిష్కారంపై పెడితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
తెలంగాణ నేతలతో పాటు ప్రభుత్వం కూడా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. విద్యా సంబంధ అంశాలు, అడ్మిషన్లు ఆర్టికల్ 371 (డి) ప్రకారం పదేళ్లపాటు సంయుక్తంగా జరగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగం మీద గౌరవం ఉంచుకుంటే సమస్యలన్నీ చక్కబడతాయన్నారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిషోర్ బాబు తదితరులు కూడా తెలంగాణ ప్రభుత్వం పైన మండిపడ్డారు. విద్యార్థులకు నష్టం కలిగించకుండా వెంటనే కౌన్సెలింగ్‌కు కలిసి రావాలని సూచించారు.

కాగా, కౌన్సెలింగ్ వ్యవహారంలో తమ వాదన నెగ్గిందని ఏపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా సెప్టెంబరు దాకా కౌన్సెలింగ్‌కు గడువు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించిందంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు సహకరించాలని సూచిస్తున్నారు. సుప్రీం తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టుగా వారి భావిస్తున్నారు. మరోవైపు తెరాస నేతలు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు.
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన నెగ్గిందనేది కాదని, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయదని, ఇదే విషయం కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారన్నారు.
ఎంసెట్‌పై చాలా సందర్భల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్లో కూడా సెప్టెంబర్ 30 వరకు తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని, అందుచేత ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ విషయమై తెలంగాణ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు రావడం సహజమన్నారు. ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చింది తీర్పు కాదని, న్యాయమూర్తి తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు. న్యాయస్థానం నుంచి లిఖితపూర్వకమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే స్పందిస్తామని, న్యాయమూర్తుల అభిప్రాయాలపై స్పందించలేమని వినోద్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications