చంద్రబాబు ఇంటిపై దాడి కేసు-దేవినేని, జోగి రమేశ్ బెయిల్ పై సుప్రీం కీలక నిర్ణయం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేశ్ విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వీరు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు.
అయితే పోలీసులు సకాలంలో స్పందించి వీరిని అడ్డుకున్నారు. ఈ కేసులో వీరిని అరెస్టు చేసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం 20 మందికి పైగా కేసులు నమోదు చేసింది. వీరిలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి చేసే నాటికి జోగి రమేష్ కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కేసులో వీరిని ఇప్పటికే పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే అరెస్టు చేయకుండా గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాల గడువు ముగిసిపోవడంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 20 మంది సు్ప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీరందరికీ ఊరట లభించినట్లయింది. అయితే వీరిని దేశం విడిచి వెళ్లొద్దని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆంక్షలు విధించింది. మరోవైపు ఈ కేసులో మూడేళ్లుగా దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications