పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల రద్దు - దారి మళ్లింపు..!!
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు ప్రధాన రైళ్లను తాత్కాలికంగా రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వచ్చే నెల 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. వీటితోపాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా ఈ సర్వీసులను కొన్నిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో మూడో లైను పనుల కారణంగా ప్రయాణికులకు రైళ్ల సేవల్లో అంతరాయం కలగుతుందని పేర్కొన్నారు. రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ నెల 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో పుణె-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, జూలై 29, 31న సికింద్రాబాద్-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. జూలై 30, 31న సికింద్రాబాద్-ముంబై, ముంబై-సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ రద్దు అయింది.

ఈ నెల 31న నిజామాబాద్-పుణె ఎక్స్‌ప్రెస్ రద్దు చేసారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, డోర్నకల్-విజయవాడ, విజయవాడ-డోర్నకల్ రైళ్లు, విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు సికింద్రాబాద్ -విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింద్రాబాద్-గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్-తిరుపతి తిరిగే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతోపాటు పలు రైళ్లను దారి మళ్లించారు.












Click it and Unblock the Notifications